Bhatti Vikramarka: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై చర్చ హోరెత్తింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రివర్గ సభ్యుడు హరీశ్‌రావుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “కాళేశ్వరం ప్రాజెక్టుకు ‘మామ’ డిజైన్ చేశారు, ‘అల్లుడు’ అమలు చేశాడు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజినీర్ల సలహాలను పక్కనపెట్టడం వల్లే ఈ భారీ విఫలం చోటుచేసుకుంది,” అని ఆయన మండిపడ్డారు.
భట్టి మాట్లాడుతూ, “ఇంద్రమ్మ ఇల్లు కడితే కూడా ఆర్కిటెక్ట్ సలహా తీసుకుంటారు. కానీ ఈ ప్రాజెక్టులో నిపుణులను సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్ర ఖజానా కోలుకోలేని నష్టాన్ని చవిచూసింది. నిజంగా తప్పులు చేయలేదనుకుంటే కమిషన్ నివేదికపై కోర్టుకెళ్లి ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు?” అని ప్రశ్నించారు.
కమిషన్ నివేదికపై పారదర్శక చర్చకు కట్టుబడి ఉన్నాం
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక పూర్తిగా నిష్పాక్షికంగా రూపొందించబడింది. ఈ దేశంలో అత్యున్నత గౌరవం పొందిన న్యాయమూర్తి ఇచ్చిన నివేదికను సభలో పారదర్శకంగా చర్చిస్తున్నాం. ప్రభుత్వం నిజాలు చెబితే కక్షసాధింపు అంటున్నారు, కాంగ్రెస్ మాట్లాడితే రాజకీయం అంటున్నారు. ఇది సరైంది కాదు అని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం.. అంతాఇంతా కాదు
భట్టి మాట్లాడుతూ, “సభలో చర్చ జరగకుండా అడ్డుకోవడం బీఆర్ఎస్ సభ్యుల తీరేంటి? ప్రజలు ఈ నివేదికపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం బ్యారేజీలు కుంగిపోతున్నాయి, రాష్ట్రం లక్ష కోట్లకు పైగా నష్టపోయింది. ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?” అని ప్రశ్నించారు.
రీడిజైన్‌ల పేరుతో ప్రాజెక్టుల ఖర్చులు ఆకాశమంత
భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై సీరియస్ ఆరోపణలు చేశారు. “ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులు రూ.1,450 కోట్లలో పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండగా వాటి అంచనాలను రూ.25 వేల కోట్లకు పెంచేశారు. లక్షల కోట్లు ఖర్చు చేసి రైతులకు ఒక్క ఎకరానికీ నీరు అందించలేదు,” అని మండిపడ్డారు.
“రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసి, నివేదికను సభ ముందుకు తెచ్చాం. కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడి ఉంటే హుందాగా ఉండేది,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ చర్చలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభలో ఉద్రిక్తత సృష్టించారు. అయితే ప్రభుత్వం పారదర్శకతకు కట్టుబడి ఉందని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.