Bandi Sanjay: తెలుగు సినీ పరిశ్రమలో అర్ధశతాబ్దానికి పైగా హీరోగా వెలుగొందిన అరుదైన ఘనత నందమూరి బాలకృష్ణకు లభించింది. హైదరాబాదులోని హైటెక్ సిటీలో హోటల్ ట్రైడెంట్‌లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ – యూకే సన్మాన కార్యక్రమంలో ఆయనకు ఈ గౌరవం లభించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై బాలకృష్ణ సినీ, రాజకీయ, సామాజిక రంగాల్లో చేసిన సేవలను కీర్తించారు.
బాలయ్య సినీ ప్రస్థానం – అర్ధ శతాబ్దపు అప్రతిహత ప్రయాణం
1974లో విడుదలైన తాతమ్మ కలతో వెండితెర ప్రయాణాన్ని ప్రారంభించిన బాలకృష్ణ, నేటి వరకు 100కు పైగా సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక కథాంశాలతో విభిన్న పాత్రలు పోషిస్తూ ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందారు.
సమరసింహారెడ్డితో ఫ్యాక్షన్ చిత్రాలకు కొత్త దారులు చూపిన బాలయ్య, సింహా, లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణి, అఖండ, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో బాక్సాఫీస్ విజయాలను సాధించారు. వయసు పెరిగినా నటనలో వన్నె తగ్గకుండా ‘‘అన్ స్టాపబుల్’’గా రాణిస్తున్నారని బండి సంజయ్ ప్రశంసించారు.
నందమూరి వారసత్వానికి ప్రతీక
తన తండ్రి, మహానటుడు నందమూరి తారకరామారావు వారసత్వాన్ని నిలబెట్టిన నటుడిగా బాలకృష్ణ తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. కథానాయకుడు, మహానాయకుడు వంటి చిత్రాల్లో దాదాపు 60 గెటప్పులతో నటించి ఎన్టీఆర్ గారి విశిష్టతను ప్రజలకు చాటిచెప్పారు.
ఇది కూడా చదవండి: Telangana Assembly: అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం..
సమాజసేవలో బాలయ్య దాతృత్వం
సినిమాల్లోనే కాక నిజజీవితంలోనూ బాలకృష్ణ ‘రియల్ హీరో’ అని నిరూపించారు. తన తల్లి పేరుతో స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మంది క్యాన్సర్ రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించేందుకు కృషి చేస్తున్నారు.
అవార్డుల పర్వం
కళారంగానికి చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం బాలకృష్ణను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించగా, తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందించింది. ఇప్పుడు ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కావడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం.
రాజకీయాల్లో క్రియాశీల నేత
సినిమా రంగంలో అప్రతిహతంగా రాణించిన బాలకృష్ణ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో నిత్యం చురుకుగా వ్యవహరిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
‘‘జై బాలయ్య’’ – అభిమానుల గుండెల్లో ప్రతిధ్వనించే నినాదం
తెలుగు రాష్ట్రాల్లో యువత హర్షం, ఆవేశం, ఆక్రోశం ఏ సందర్భంలోనైనా నోటి నుండి వచ్చే మొదటి నినాదం ‘‘జై బాలయ్య’’ కావడం ఆయన ప్రజాదరణకు నిదర్శనం.
