డోనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలు విధించడం, పన్నులు పెంచడం వంటి అంశాలపై అమెరికాలో పలువురు ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సులేవాన్ కూడా భారత్ పై సుంకాలు విధించడాన్ని తప్పుబట్టారు. ఈ సుంకాల కారణంగా అమెరికా బ్రాండ్ పతనమైందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ట్రంప్ విధించిన 50% సుంకాలను జేక్ సుల్లివన్ విమర్శిస్తూ ఇది అమెరికా ప్రపంచ స్థాయిని దెబ్బతీస్తుందని అంతేకాకుండా భారత్ ను చైనాకు దగ్గర చేస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ శూన్యంలో ఉందని అభిప్రాయపడ్డారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మిత్ర దేశాలతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు అమెరికాకు భాగస్వామిగా ఉండేందుకు ఇష్టపడటం లేదన్నారు. యూఎస్‌ను విఘాతం కలిగించే దేశంగా చూస్తున్నారన్నారు. ఈక్రమంలో చైనా వైపు ఆదరణ పెరిగిపోతుందన్నారు. ఇందుకు భారత్ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. న్యూదిల్లీపై పెద్ద మొత్తంలో సుంకాలు విధించడంతో.. ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో ఆ దేశం బీజింగ్‌తో భాగస్వామ్యం బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్‌లో ఉంది. భారత్‌పై ట్రంప్ భారీ వాణిజ్య దాడి చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా న్యూదిల్లీ ఇప్పుడు చైనాతో కలవాలని చూస్తోంది’ అని జేక్ సులేవాన్ పేర్కొన్నారు.
కాగా ట్రంప్ పరిపాలన భారతదేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు విధించడం లేదా ఉన్న సుంకాలను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ సుంకాల మొత్తం 50%కి చేరింది. ముఖ్యంగా రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేసినందుకు గాను, అదనంగా 25 శాతం సుంకం విధించారు. ఇదివరకు ఉన్న 25 శాతం సుంకాలతో కలిపి మొత్తం సుంకాల భారం 50 శాతానికి పెరిగింది