Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సెప్టెంబర్ 2 తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మరింత పెరుగుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు. తెలంగాణలోనూ వర్షాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
ఏపీకి ఆరెంజ్, ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు, ప్రకాశం, నెల్లూరు, కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణలో ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా, వాతావరణ శాఖ మరికొన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది. తెలంగాణలోని 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు కూడా తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.