Delhi: రామసేతువును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలన్న డిమాండ్‌పై సుప్రీంకోర్టు కీలక ముందడుగు వేసింది. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) డైరెక్టర్, ఏఎస్ఐ తమిళనాడు ప్రాంతీయ డైరెక్టర్ ఈ నోటీసులకు నిర్దిష్ట సమయంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రామసేతువుకు మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యత ఉందని, దాన్ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని తన విజ్ఞప్తిపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్వామి పిటిషన్‌లో పేర్కొన్నారు.
2023 జనవరిలోనే ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్వామి, కేంద్రానికి మరిన్ని పత్రాలు సమర్పించేందుకు అప్పట్లో అనుమతి పొందినా స్పందన రాకపోవడంతో ఈ ఏడాది మేలో సాంస్కృతిక మంత్రికి విజ్ఞప్తి చేసి, తాజాగా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాలతో రామసేతువుకు జాతీయ వారసత్వ హోదా లభించే అవకాశాలపై ఆసక్తి నెలకొంది.