Chandrababu Naidu: పర్యాటక రంగం అభివృద్ధికి, ప్రజల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు నగర పర్యాటకులను, ప్రజలను ఆకర్షించనున్నాయి.
అభివృద్ధికి కొత్త ఉత్సాహం
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, విశాఖపట్నాన్ని దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పోటీపడే స్థాయికి తీసుకొస్తామని అన్నారు. “విశాఖ ఆర్థిక రాజధానిగా, టెక్ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందనుంది. త్వరలోనే ఇక్కడ డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు కానున్నాయి. ఇది నగరం అభివృద్ధికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
విశాఖపై ప్రజల తీర్పు
గత ప్రభుత్వ పాలనపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. “గత పాలకులు విశాఖను రాజధాని చేస్తామని చెప్పారు. కానీ ప్రజలు ఆ ప్రతిపాదనను తిరస్కరించి, రాజధాని వద్దని తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారు” అని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులు విశాఖకు కొత్త అందాన్ని తీసుకురావడమే కాకుండా, పర్యాటక రంగానికి కూడా ఊతమిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.