Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20 రోజుల క్రితం అదృశ్యమైన యువతి మృతదేహం అనుమానాస్పదంగా లభ్యం. మృతదేహం పక్కన క్షుద్రపూజల సామాగ్రి ఉండడంతో పూజల కోసం బలి ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఒక సంఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. సుమారు 20 రోజుల క్రితం అదృశ్యమైన ఒక యువతి మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో అటవీ ప్రాంతంలో లభ్యమైంది. మృతదేహం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పూజాసామగ్రి ఉండడంతో క్షుద్రపూజలు చేసి చంపారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ దారుణ సంఘటన కాటారం-భూపాలపల్లి జాతీయ రహదారికి సమీపంలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. అటుగా వెళ్తున్న పశువుల కాపర్లు ఒక కుళ్లిపోయిన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలు చిట్యాల మండలం ఒడితెల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి (22) అని గుర్తించారు.
Also Read: Chiranjeevi: ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమాని.. గొప్ప మనసు చాటుకున్నమెగాస్టార్
వర్షిణి ఈ నెల 6వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లి చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో, ఆమె మృతదేహం లభ్యం కావడం ఈ కేసులో ఒక కీలక మలుపు.
మృతదేహం వద్ద లభించిన పూజా సామాగ్రి, ఆమె మరణంపై అనేక సందేహాలను లేవనెత్తుతోంది. వర్షిణి ఆత్మహత్య చేసుకుందా, లేక క్షుద్రపూజల కోసం ఎవరైనా ఆమెను బలి తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 20 రోజుల పాటు ఆమె ఎక్కడ ఉన్నారు? అటవీ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? ఆమెతో పాటు ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, త్వరలోనే నిజాన్ని వెలికితీస్తామని పోలీసులు తెలిపారు.