Lobo: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలు తీసిన టీవీ నటుడు లోబో అలియాస్ ఖయూమ్‌కు జనగామ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, రూ. 12,500 జరిమానా కూడా చెల్లించాలని గురువారం తీర్పునిచ్చింది. ఈ ఘటన 2018లో జరిగిందని పోలీసులు తెలిపారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేశ్ ఇచ్చిన వివరాల ప్రకారం… 2018 మే 21న ఒక టీవీ ఛానల్ కోసం లోబో తన బృందంతో కలిసి రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల గుడి వంటి ప్రాంతాల్లో వీడియో చిత్రీకరణ జరిపారు. షూటింగ్ పూర్తయిన తర్వాత, లోబో స్వయంగా కారు నడుపుతూ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా, రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వస్తున్న ఒక ఆటోను ఢీకొట్టారు.
Also Read: Taylor Swift: సంచలనం సృష్టిస్తున్న టేలర్ స్విఫ్ట్ నిశ్చితార్థ ఉంగరం!
ఈ ఘోర ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి గ్రామానికి చెందిన మణెమ్మ అనే ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. ఆటోలో ఉన్న మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు లోబో కారు కూడా బోల్తా పడటంతో, అతనికి, అతని బృంద సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. సుదీర్ఘ విచారణ అనంతరం, ఇద్దరి మృతికి కారణమైన లోబో నేరస్థుడుగా రుజువు కావడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని పోలీసులు అభిప్రాయపడ్డారు.

