Heavy Rains: తెలంగాణ రాష్ట్రం మీద వర్షాలు విరుచుకుపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రతరమై, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
కామారెడ్డి – మెదక్‌లో రెడ్ అలర్ట్
కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రామాయంపేటలో వరద నీటిలో ఇరుక్కుపోయిన సుమారు 300 మంది విద్యార్థులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా రక్షించాయి. కామారెడ్డి జిల్లా ఆర్గొండలో 31.93 సెం.మీ., మెదక్ జిల్లా నాగాపూర్‌లో 20.88 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
పాఠశాలలకు సెలవు
వర్షాల తీవ్రత దృష్ట్యా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం జిల్లాల్లోనూ గురువారం (ఆగస్టు 28) విద్యాసంస్థలకు సెలవులు అమలులోకి వచ్చాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Nivetha Pethuraj: పెళ్లిపీటలు ఎక్కనున్న నివేదా.. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్
విశ్వవిద్యాలయ పరీక్షల వాయిదా
రవాణా సౌకర్యాలు దెబ్బతినడంతో తెలంగాణ విశ్వవిద్యాలయం పీజీ, బీఎడ్, ఎమ్మేడ్ పరీక్షలను వాయిదా వేసింది. హాస్టళ్లలో విద్యార్థులు ఇరుక్కుపోవడంతో పరీక్ష కేంద్రాలకు వెళ్లే అవకాశం లేకపోయింది.
రైళ్లు రద్దు
భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే అనేక రైళ్లను రద్దు చేసింది. కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-నిజామాబాద్, కాచిగూడ-మెదక్, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్-తిరుపతి వంటి సర్వీసులు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్-కాచిగూడ, షాద్‌నగర్-కాచిగూడ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. కొన్ని ట్రాక్‌లపై వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సీఎం ఆదేశాలు
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాబోయే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కరీంనగర్, నిజామాబాద్ సహా మరికొన్ని జిల్లాల్లో కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
ఏపీలోనూ ప్రభావం
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంట 40–60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పుగోదావరి, గుంటూరు సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మొత్తం మీద, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.