Bhatti vikramarka: తెలంగాణలో కురుస్తున్న అతివృష్టి, వరదల నడుమ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ప్రభుత్వ సహాయక చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘాటుగా సమాధానమిచ్చారు.
కేటీఆర్ ఆరోపణల ప్రకారం, “ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి బీహార్ యాత్రలో గడుపుతున్నారు. మా పాలనలో కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేవారు” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క మండిపడ్డారు. “ప్రతిపక్ష నేతలకు వాస్తవ సమాచారం లేదు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. సీఎం, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మీలాగా మా ముఖ్యమంత్రి ఫాంహౌస్లో నిద్రపోవడం లేదు” అని చురకలంటించారు.
భట్టి స్పష్టం చేసిన ప్రకారం, జిల్లాల వారీగా మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే, తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలు నీట మునిగాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఒకే రాత్రిలో 49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో రోడ్లు, రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. చెరువులకు గండ్లు పడటంతో పంట పొలాలు మునిగిపోయి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తన్నారు.
