Nara lokesh: రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని మానవ వనరులు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ర్యాపిడో భాగస్వామ్యంతో అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకం ఈ ప్రయాణంలో ఆరంభం మాత్రమే అని ఆయన అన్నారు.
“తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందిస్తుంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే వెయ్యి మందికి పైగా మహిళలు లబ్ధి పొందడం సంతోషకరం. రాబోయే రోజుల్లో కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం” అని లోకేశ్ హామీ ఇచ్చారు.
ప్రభుత్వం – ర్యాపిడో మద్దతు
ప్రభుత్వ సబ్సిడీ: స్కూటర్కు రూ.12,300, ఆటోకు రూ.36,000
ర్యాపిడో సపోర్ట్:
3-4 నెలలపాటు ప్లాట్ఫామ్ ఫీజు మినహాయింపు
మొదటి ఏడాది నెలకు రూ.1,000 ఈఎంఐ సహాయం
ఈ చర్యలతో మహిళలపై ఆర్థిక భారం తగ్గింది.
మూడు నెలల్లోనే అద్భుత ఫలితాలు
ఈ పథకం ద్వారా ర్యాపిడోలో చేరిన మహిళలు మే, జూన్, జూలైలో 45 వేల రైడ్లు పూర్తి చేసి రూ.35 లక్షల ఆదాయం సంపాదించారు. విజయవాడకు చెందిన గ్లోరీ మంజు, మాధవి, భవాని వంటి మహిళలు నెలకు రూ.10,000 – రూ.16,000 వరకు సంపాదిస్తూ కుటుంబాలకు బలమైన ఆదారంగా నిలుస్తున్నారు.
“ఇంటి పనులు పూర్తయ్యాక ఖాళీ సమయంలో పనిచేయడం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం పొందాం” అని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఏడాదిలో మరో 4,800 మహిళలకు పథకాన్ని విస్తరించే ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

