Revanth Reddy

Revanth Reddy: ఈ 108 ఏళ్ల యూనివర్సిటీకి తొలిసారిగా మేం దళితుడిని వీసీ చేశాం

Revanth Reddy: తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తూ, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని వ్యాఖ్యానించారు. “ఈ యూనివర్సిటీ తెలంగాణ ప్రజల చైతన్యానికి కేంద్రబిందువు. 4 కోట్ల తెలంగాణ వాసుల గళం ఉస్మానియానే,” అని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యమాలకు అడ్డా అయిన ఉస్మానియా

రేవంత్‌ గుర్తుచేసుకుంటూ—పీవీ నరసింహరావు, జైపాల్‌రెడ్డి లాంటి మహానుభావులు ఇక్కడే విద్యనభ్యసించారని, జార్జిరెడ్డి, గద్దర్‌ వంటి ఉద్యమ యోధులను ఈ విశ్వవిద్యాలయం అందించిందని అన్నారు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి వంటి విద్యార్థులు తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించారని పేర్కొన్నారు.

అలాగే సీవీ ఆనంద్‌ వంటి యంగెస్ట్‌ IPS అధికారి ఉస్మానియా నుంచే వచ్చిన గర్వకారణం అని చెప్పారు. “ఈ 108 ఏళ్ల యూనివర్సిటీకి తొలిసారిగా మేం దళితుడిని వీసీ చేశాం. కానీ కేవలం దళితుడు అని కాదు, ఆయన నైపుణ్యాన్ని గుర్తించి గౌరవించాం” అని రేవంత్‌ స్పష్టం చేశారు.

చైతన్యం – చర్చ – మార్పు

“ఉస్మానియా యూనివర్సిటీ పోరాటం నేర్పింది. చైతన్యం అందించింది. కానీ కొంతమంది దాన్ని కాలగర్భంలో కలపాలని చూశారు. మేం మళ్లీ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం,” అని సీఎం తెలిపారు. విద్యార్థులు కేవలం సమస్యల చర్చలోనే కాకుండా సైద్ధాంతిక అంశాలపై కూడా చురుకుగా ఉండాలని సూచించారు.

అదే సమయంలో, సమాజంలో పెరుగుతున్న అసహనం, అశాంతి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. “చర్చించేవారిని అణచివేయడం ఎక్కువ కాలం నిలబడదు. యువనాయకత్వమే దేశ భవిష్యత్తు” అని రేవంత్‌ అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Harish Rao: ఆశా వర్కర్లవి గొంతెమ్మ కోరికలు కావు మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం

డ్రగ్స్‌ ముప్పుపై హెచ్చరిక

ఉస్మానియాతో పాటు ఇతర కళాశాలల్లో కూడా డ్రగ్స్‌ వేగంగా విస్తరిస్తున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. “విద్యాసంస్థల్లో చైతన్యవంతమైన చర్చలు తగ్గిపోవడంతో విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతున్నారు. ఇది రాష్ట్రానికి పెద్ద ప్రమాద సంకేతం” అని హెచ్చరించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి – విద్యలో పెట్టుబడులు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ, “పంచాడానికి భూములు లేవు, ఖజానా ఖాళీగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే లక్ష కోట్లు గంగలో కలిశాయి” అని రేవంత్‌ విమర్శించారు.

అయితే విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. “రూ.25 వేల కోట్లతో యంగ్‌ ఇండియా స్కూల్స్‌ను నిర్మిస్తున్నాం. మేం పేదరికం నుంచే ఎదిగాం. విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం చేసే వారిని తప్పక వ్యతిరేకించాలి” అని సీఎం పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *