KRM Mayor Seat Heat: కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ 2005లో ఏర్పడింది. అప్పుడు కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ రానప్పటికీ, ఎంఐఎమ్‌తో పాటు ఇండిపెండెంట్ల సహకారంతో మేయర్ సీటును కైవసం చేసుకుంది. తర్వాత పదేళ్లకు 2015లో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీఆర్ఎస్ మెజారిటీ సీట్లు సాధించింది. కాంగ్రెస్ 14 సీట్లకు పరిమితమైంది. అందులో 13 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. దీంతో మేయర్ సీటును బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మళ్లీ 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా సాధించలేకపోయింది. ఇక్కడ మరోసారి బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బీజేపీ ఈ ఎన్నికల్లో 13 స్థానాల్లో విజయం సాధించింది.
మెజారిటీ స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచింది. అదే విధంగా 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడవ స్థానానికి పరిమితమైంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కరీంనగర్‌లో అనుకున్న స్థాయి ఓట్లు సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఇక్కడ మాత్రం బలోపేతం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. ఇక్కడ బలమైన నాయకత్వం కరవైంది. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్ చేశారు. ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో సీఎం నేరుగా రంగంలోకి దిగారు.
Also Read: Urea Case: యూరియా.. ఇదేందయా! పీఏసీఎస్ డైరెక్టర్ ఇంటిలో అక్రమంగా నిల్వ
గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన రాజేందర్ రావును సీఎం హైదరాబాద్‌కు పిలిపించుకున్నారు. ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పాగా వేయాలని సూచించినట్లు సమాచారం. ఇక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ గట్టిగా ఉన్నాయి. మాజీ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్‌లు కూడా కరీంనగర్‌పై పట్టు సాధించాలని, ఎలాగైనా మెజారిటీ స్థానాలు గెలుచుకొని మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడు ఇదే కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలు సర్వేలు కూడా బీఆర్ఎస్, బీజేపీలు కరీంనగర్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాయని చెబుతున్నాయి. అయితే, మొదట బీఆర్ఎస్‌ను బలహీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో డివిజన్ల వారీగా రాజేందర్ రావు ముఖ్య నేతలను కలుస్తున్నారు. ఇక్కడ మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు.
అంతేకాదు, ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎంకు రిపోర్ట్ అందిస్తున్నారు. గతంలో కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేయనున్నారు. ఎన్నికల కంటే ముందే పనులను పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికే పెండింగ్ పనుల వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలపై దృష్టి పెడుతున్నారు. మరో నెల రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీగా ఉండే వాతావరణం సృష్టించాలని చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వస్తున్నారు. ఇక్కడ పాగా వేస్తే బీజేపీ దూకుడును తగ్గించవచ్చని సీఎం కూడా భావిస్తున్నారు. దీంతో సీఎం ఈ కార్పొరేషన్‌పై దృష్టి పెట్టి నేతలను పరుగు పెట్టిస్తున్నారు. పూర్తిగా రాజేందర్ రావుకు గెలుపు బాధ్యతలు అప్పజెప్పారు. ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరింత స్పీడ్‌ను పెంచి కరీంనగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం ప్రత్యేక దృష్టి పెట్టడంతో మిగతా నేతలు కూడా సైలెంట్ అవుతున్నారు.