Supreme Court Of India:ఢిల్లీ నగరంలోని వీధి కుక్కలన్నింటినీ పూర్తిగా షెల్టర్లకు పంపించాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. తాజాగా ఆ ఆదేశాలను సవరిస్తూ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజరియాతో కూడి ముగ్గరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టడం, పెంపుడు కుక్కలను రోడ్లపై వదిలేయడం, దత్తత తీసుకోవడం వంటి విషయాలపై ధర్మాసనం మర్గదర్శకాలను విడుదల చేసింది.
1) గతంలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ హాని చేసే లేదా క్రూరంగా ఉండే కుక్కలను మాత్రమే షెల్టర్ హోంలలో ఉంచాలని కోర్టు పేర్కొన్నది.
2) వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు మున్సిపాలిటీలు ప్రత్యేక ప్రాంతాలను గుర్తించాలని, ఆయా ప్రదేశాల్లోనే ఆహారం ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది.
3) టీకాలు వేసిన లేదా స్టెరిలైజేషన్ చేసిన కుక్కలను తిరిగి వాటి ప్రదేశాలలోనే విడుదల చేయాలి.
4) డాగ్ షెల్టర్లలోని కుక్కలను జంతు ప్రేమికులు దత్తత తీసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు కూడా ఇందుకు సహకరించాలి.
5) జంతు జనన నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా నిబంధనల మేరకు కుక్కలను తరలిస్తున్న మున్సిపల్ సిబ్బంది చర్యలను ఎవరూ అడ్డుకోవద్దు.
6) సంబంధిత చట్టాల ప్రకారం వీధుల్లో ఎవరైనా కుక్కలకు ఆహారం పెడుతున్నట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.
7) ఆగస్టు 11వ తేదీన న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఢిల్లీ నగరంలో కొత్త డాగ్ షెల్టర్లు, పౌండ్ల ఏర్పాటుకు కోర్టు మున్సిపల్ సంస్థలను ఆదేశించింది.
8) వచ్చే 8 వారాల అనంతరం ఈ కేసుకు సంబంధించి ఆఖరి విచారణ ఉంటుందని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.