Kukatpally Murder Case: కూకట్‌పల్లిలో ఓ పదేళ్ల బాలిక దారుణ హత్య కేసులో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో బాలికను హత్య చేసింది ఓ మైనర్ బాలుడని తేలింది. ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా, బాలిక చూసిందని, అందుకే ఆమెను చంపినట్లు ఆ బాలుడు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఘటన వివరాలు..
సంగారెడ్డి జిల్లా ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు కూకట్‌పల్లి సంగీత్ నగర్‌లో నివసిస్తున్నారు. వీరికి కుమార్తె సహస్ర (10), కుమారుడు (7) ఉన్నారు. ఈనెల 18న క్రీడోత్సవాల కారణంగా పాఠశాలకు సెలవు కావడంతో సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉంది. తల్లిదండ్రులు పనికి వెళ్ళగా, తమ్ముడు స్కూల్‌కి వెళ్ళాడు. మధ్యాహ్నం స్కూల్ సిబ్బంది ఫోన్ చేయడంతో కృష్ణ ఇంటికి తిరిగి వచ్చి చూడగా, కుమార్తె కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా కనిపించింది. ఈ సంఘటనతో భయపడిన కృష్ణ పోలీసులకు సమాచారం అందించారు.
దర్యాప్తులో షాకింగ్ విషయాలు
పోలీసులు దర్యాప్తులో బాలిక శరీరంపై దాదాపు 20 కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో 10 గాయాలు మెడపైనే ఉన్నాయి. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సభ్యులు ఆధారాలు సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో, దొంగతనానికి వచ్చిన సాయి అనే పదో తరగతి విద్యార్థిని (15 సంవత్సరాలు) స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో సాయి మొదట పొంతన లేని సమాధానాలు చెప్పాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా, సాయి నేరం అంగీకరించాడు.
Also Read: Srilanka: శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్టు
ముందస్తు ప్రణాళికతో హత్య
సాయి ఇంట్లో దొంగతనం చేయడానికే వచ్చానని, ₹80,000 నగదు తీసుకుని వెళ్తుండగా సహస్ర చూసిందని పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనతో పట్టుబడతానేమోనని భయపడి సహస్రను హత్య చేసినట్లు చెప్పాడు. సాయి ఈ దొంగతనానికి ముందే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డువస్తే ఏం చేయాలి అనే వివరాలను ఒక పేపర్‌పై రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఆ బాలుడిలో 15 ఏళ్ల వయసులోనే ఒక క్రిమినల్ మనస్తత్వం కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ హత్యకు సంబంధించిన ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించకపోవడంతో, స్థానికులు ఇచ్చిన చిన్న క్లూతోనే పోలీసులు ఈ కేసును ఛేదించగలిగారు. ఒక మైనర్ బాలుడు ఇంతటి ఘోరానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.
