Weather Update

Weather Update: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్

Weather Update: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఆగడం లేదు. గత రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు, మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.

ఉత్తర తెలంగాణలో వర్ష బీభత్సం
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి, చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. జలాశయాల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

ఈ జిల్లాలకు హెచ్చరికలు
ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం కూడా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

హైదరాబాద్‌లోనూ వర్షాలు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామపట్నం గ్రామంలో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలు జాగ్రత్తగా ప్రయాణించాలని, అనవసర ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *