Uttam Kumar; రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరదల వల్ల సంభవించిన నష్టాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నీటిపారుదల విభాగ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, వరద నష్టం నివేదికలో రాష్ట్రవ్యాప్తంగా 117 ట్యాంకులు, కాలువలు, లిఫ్ట్‌లకు పగుళ్లు సంభవించాయి. వీటి పునరుద్ధరణకు సుమారు ₹335 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేయబడింది.
ఆదిలాబాద్, ములుగు, మహబూబ్‌నగర్, సూర్యాపేట జిల్లాల్లో భారీ నష్టం సంభవించినట్లు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో శాశ్వత పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వరద నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
జలాశయాల స్థితి సమీక్ష
మంత్రి ఉత్తమ్ కృష్ణా, గోదావరి బేసిన్లలోకి భారీగా నీటి ప్రవాహాలు చేరుతున్నాయని తెలిపారు. కృష్ణా బేసిన్‌లోకి గణనీయమైన స్థాయిలో ఇన్‌ఫ్లోలు నమోదవుతున్నాయని, గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో కూడా నీటి ప్రవాహాలు పెరుగుతున్నాయని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 34,740 చెరువుల్లో 12,023 చెరువులు మిగులు నిల్వలతో ఉండగా, 9,100 కంటే ఎక్కువ ట్యాంకులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పెరుగుతున్న నీటి ప్రవాహాలపై నిఘా ఉంచి, వరద నష్టాన్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.