MP Mithun Reddy: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలన్న డిమాండ్‌తో వైసీపీ ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ పాదయాత్రను తిరుమలలోకి అనుమతించలేమంటూ పోలీసులు అడ్డుకున్నారు.
లిక్కర్ కేసులో అరెస్టైన మిథున్‌రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు త్వరగా బెయిల్ మంజూరు కావాలనే ఉద్దేశంతో హరిప్రసాద్‌రెడ్డి సోమవారం పీలేరు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మొదట కల్యాణ్డ్యామ్ వరకు విజయవంతంగా కొనసాగిన ఈ పాదయాత్ర, మంగళవారం ఉదయం తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురానికి చేరింది.
తిరుమల శ్రీవారి మెట్టు మార్గం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, సీఐ ఇమ్రాన్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. “మిథున్‌రెడ్డి బెయిల్ కోసం చేసే ఈ పాదయాత్రను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల చేరేందుకు అనుమతి ఇవ్వం” అని పోలీసు అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించిన వైసీపీ నేతలు, అక్కడే నిరసనకు దిగారు. “మిథున్‌రెడ్డి కోసం చేసే పాదయాత్రను అడ్డుకోవడం దుర్మార్గం. ఏడుకొండల స్వామిని దర్శించుకోవడానికీ అవకాశం ఇవ్వకపోవడం విచారకరం” అని అనుచరులు మండిపడ్డారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మరియు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, హరిప్రసాద్‌రెడ్డి సహా పలువురు నాయకులు అక్కడే ధర్నా కొనసాగిస్తున్నారు.

