Asia Cup 2025

Asia Cup 2025: చోటు దక్కేది ఎవరికి.. ఆసియాకప్‌నకు భారత జట్టు ఎంపిక నేడే

Asia Cup 2025: 2025 ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టు ఎంపిక ఈరోజు ముంబైలో జరుగుతుంది. సెలక్షన్ కమిటీ సమావేశం తర్వాత, ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి జట్టును ప్రకటిస్తారు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్ T20 ఫార్మాట్‌లో జరగనుంది.

భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, హాంగ్ కాంగ్ జట్లు ఇందులో పాల్గొంటాయి. టీ20 ప్రపంచ కప్‌కి సన్నాహకంగా ఈ టోర్నమెంట్ ఉండబోతోంది కాబట్టి, యువ ఆటగాళ్లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్,సంజు శాంసన్‌లలో ఓపెనింగ్ స్థానాల కోసం గట్టి పోటీ ఉంది.గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ టీమ్ లీడ్ చేసే అవకాశం ఉంది. అలాగే, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉండొచ్చు.ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు ప్రధానంగా బరిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: KTR: హైదరాబాద్‌లో శాంతిభద్రతల క్షీణతపై కేటీఆర్‌ ఆగ్రహం

వీరిలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఫాస్ట్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయం. అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా వంటి యువ బౌలర్లు కూడా పోటీలో ఉన్నారు. స్పిన్నర్ల విషయానికి వస్తే, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మరియు వరుణ్ చక్రవర్తి వంటి వారికి అవకాశం దక్కవచ్చు. సాధారణంగా ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో జట్టును ప్రకటిస్తారు. అయితే, కొన్ని నివేదికల ప్రకారం ఈసారి 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. కాగా ఆసియా కప్‌తో పాటుగా, మహిళల ప్రపంచ కప్ కోసం భారత మహిళా జట్టును కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *