Kamalapuram Putta: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఓటమి తాకిడికి ప్రెస్మీట్ పెట్టి మరీ వాపోయారు సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి. పులివెందులలో తన పార్టీ అభ్యర్థి ఓటమికి కారణం వీరేనంటూ.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి సవితమ్మ, పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే పుట్టా చైతన్యల పేర్లు మరీ మరీ తలచుకున్నారు. ఆదినారాయణ రెడ్డి గతంలో వైసీపీలో పని చేసినప్పటికీ.. ఆ తర్వాత జగన్‌కి ఆగర్భ శత్రువులా మారారు. సవితమ్మది మంత్రి హోదా. బీటెక్ రవి పులివెందులలో తాను ప్రత్యక్షంగా ఫేస్ చేయాల్సిన ప్రత్యర్థి. మరి కమలాపురం యువ ఎమ్మెల్యే పుట్టా చైతన్య ఏం చేశారు? జగన్ ఆయన పేరు ఎందుకు తీశారు? ఫస్ట్‌టైం ఎమ్మెల్యే అయిన ఆ యువ నేతపై జగన్‌కు ఎందుకు అంత అక్కసు అనుకుంటున్నారా? అసలు మ్యాటర్ చాలానే ఉందంటున్నారు కడప జిల్లా విశ్లేషకులు.
Also Read: Babu Kodukochadu: అసలు ఆట ఇప్పుడే మొదలయ్యిందా?
“పులివెందులలో కేంద్ర బలగాలు పెట్టినా సరే గెలుపు మాదే.” కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు వైరల్‌గా మారాయి. ఆ యువ ఎమ్మెల్యే మాటల్లో అంత నమ్మకం కనిపించింది. చైతన్యరెడ్డిపై నారా లోకేష్‌కు ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దూసుకెళ్తున్నారు చైతన్యరెడ్డి. చాప కింద నీరులా పులివెందుల ఉప ఎన్నికలో వైసీపీ భరతం పట్టడంలో చైతన్యరెడ్డి తన రోల్‌ని సమర్థవంతంగా పోషించారు. అసలు జనరల్ ఎలక్షన్‌లో జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలవడంతోనే అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి. ఆ తర్వాత కడప గడ్డపై ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడును విజయవంతం చేయడంలో క్రియాశీలకంగా పనిచేశాడు. దాంతో లోకేష్ టీమ్‌లో ఒకడిగా చైతన్య రెడ్డి పేరు విస్తృతంగా తెరపైకి వచ్చింది. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో యువతని ఆకర్షించడానికి కమలాపురం నుండి చైతన్యరెడ్డిని రంగంలోకి దింపారు నారా లోకేష్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు పుత్తా చైతన్య. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రచారం చేసి శభాష్ అనిపించుకున్నాడు. టీడీపీ సమిష్టి విజయంలో భాగమైన ఈ యువ ఎమ్మెల్యే.. గెలుపు తర్వాత.. పులివెందులలో వైసీపీని రప్పా రప్పా ఓడించామంటూ చెప్పిన డైలాగులు వైసీపీకి పుండు మీద కారంలా తగిలాయట. రాబోయే రోజుల్లో కడప గడ్డపై వైసీపీకి చుక్కలు చూపించడానికి టీడీపీకి దొరికిన చురకత్తి లాంటి లీడర్‌లా కనిపిస్తున్నాడట యువనేత చైతన్య రెడ్డి.