Nara lokesh: కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో నిజమైన ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన అన్నారు. ఇది ఎంతో కష్టపడి సాధించిన విజయం అని పేర్కొంటూ, అభినందనలు తెలిపారు.
సోషల్ మీడియా వేదికగా లోకేశ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు తిరోగమనాన్ని నిరాకరించి, పురోగతికి పట్టం కట్టారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థుల విజయం ఈ విషయాన్ని ధృవీకరిస్తోందని పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన మారెడ్డి లతారెడ్డి, ముద్దుకృష్ణారెడ్డిలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మద్దతుతోనే ఈ విజయం సాధ్యమైందని లోకేశ్ అన్నారు.
