King Cobra: పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు ఉదయం ఆశ్చర్యకరమైన, భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. కిచ్చాడ గ్రామంలోని ఓ ఇంటి బాత్రూంలో ఏకంగా 16 అడుగుల పొడవైన గిరినాగు (కింగ్‌కోబ్రా) ప్రత్యక్షమైంది. ఉదయం బాత్రూంలోకి వెళ్లిన ఇంటి యజమాని భార్య, అక్కడే ఉన్న పామును చూసి ఒక్కసారిగా షాక్‌కి గురై వెంటనే కేకలు వేస్తూ బయటికి వచ్చి భర్తకు చెప్పింది.
సమాచారం అందుకున్న ఇంటి యజమాని, వెంటనే స్నేక్ క్యాచర్స్‌కి కాల్ చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఇద్దరు యువ స్నేక్ క్యాచర్స్, చాకచక్యంగా ఆ గిరినాగును పట్టుకుని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. ఈ రక్షణ చర్య మొత్తం వీడియోగా రికార్డ్ చేశారు.. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: AR Rahman: రెహమాన్ మాస్ మ్యాజిక్.. పెద్దిలో శ్రీకాకుళం బీట్!
ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో పాములు, క్రిమికీటకాలు ఇళ్లలోకి చొరబడే ఘటనలు ఎక్కువవుతున్నాయి. వరద నీరు, తడిబడ్డ ప్రదేశాలు వీటికి అనుకూలంగా మారడంతో, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.
అధికారులు, నిపుణులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, పాములు కనబడితే తామే పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే స్నేక్ క్యాచర్స్ లేదా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.