Harish Rao: సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యటించారు. ఎరువుల కోసం క్యూలో నిల్చున్న రైతులను చూసి ఆగి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ, “రైతులకు సరిపడా యూరియా వెంటనే అందించాలి. ఓటీపీ, ఒక బస్తా విధానం వెంటనే రద్దు చేయాలి. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు ఇవ్వకుండా, సబ్సిడీ నుంచి తప్పించుకునేందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎన్నికలు ఉన్నాయని బిహార్‌కు ఎరువులు తరలిస్తున్నారు” అని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశం మారనుందా ? CJI కీలక వ్యాఖ్యలు
అలాగే, ఎరువుల కొరత తీర్చడంలో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు విఫలమయ్యారని మండిపడ్డారు. “సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి తిరుగుతున్నారు కానీ ఎరువుల సమస్య మాత్రం పరిష్కరించడంలేదు” అని విమర్శించారు.
నీటిసమస్యపై ఉత్తమ్‌కు లేఖ
రైతుల పంటలకు నీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హరీశ్‌రావు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న మధ్య మానేరు, అన్నపూర్ణ, రంగనాయక్‌సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ వంటి జలాశయాలను నింపాలని డిమాండ్ చేశారు. ఆరో ప్యాకేజీ వద్ద ఉన్న మోటార్లు ఆన్ చేసి రైతులకు నీరు అందించాలన్నారు.
రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలకు రైతులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.