Rahul Gandhi

Rahul Gandhi: అభి పిక్చర్ బాకీ హై.. ఓట్ల చోరీ చేశారంటూ రాహుల్‌ విసుర్లు

Rahul Gandhi: గత ఏడాది కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్లను మోసం చేయడానికి ఎన్నికల సంఘం (EC)తో బీజేపీ కుమ్మక్కైందని, ఇప్పుడు బీహార్‌లో కూడా అదే పద్ధతిని అమలు చేయడానికి సిద్ధమవుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

మంగళవారం పార్లమెంట్‌ భవనం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ, “ఒకటి రెండు కాదు… చాలా నియోజకవర్గాల్లో అవకతవకలు జరిగాయి. ఇది యాదృచ్ఛికం కాదు, దేశవ్యాప్తంగా ఒక క్రమపద్ధతిలో జరుగుతోంది. ఎన్నికల సంఘానికి ఇది తెలిసినా, ఇప్పటి వరకు ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు మా వద్ద స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి” అని చెప్పారు.

రాహుల్‌ మాట్లాడుతూ, “ఓట్ల దొంగతనం కేవలం ఎన్నికల మోసం కాదు… ప్రజాస్వామ్యానికి పెద్ద ద్రోహం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే మా పోరాటం. సమయం వచ్చినప్పుడు ఈ అక్రమాలకు పాల్పడిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది” అన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నియోజకవర్గంలో సర్వే చేయగా, లక్షకు పైగా నకిలీ ఓట్లు బయటపడ్డాయని, అయినా ఎన్నికల సంఘం మౌనం వహించిందని ఆయన మండిపడ్డారు. “ప్రజల ఓటు హక్కును రక్షించాల్సిన సంస్థే ఇలా చేస్తే… మరెవరిని నమ్మాలి?” అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ.. 31 పదవులు భర్తీ చేస్తూ లిస్ట్ విడుదల

స్కాన్‌ చేసిన ఓటరు జాబితాలు కాకుండా, మెషిన్‌ రీడబుల్‌ ఓటరు జాబితాలను విడుదల చేయాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవల ఓటర్ల జాబితాల్లో భారీ అవకతవకలపై ప్రతిపక్ష కూటమి నేతలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన సందర్భంగా రాహుల్‌, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, సంజయ్ రౌత్‌ తదితరులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గత వారం రాహుల్‌ గాంధీ, “రాజ్యాంగంపై దాడి చేసే ముందు మూడుసార్లు ఆలోచించండి. మేము ఒక్కొక్కరినీ పట్టుకుంటాం. గత పదేళ్ల ఓటరు జాబితాలు, పోలింగ్‌ బూత్‌ వీడియో రికార్డులు ఇవ్వకపోతే దాన్ని మీరు దాచలేరు” అని ఎన్నికల సంఘాన్ని హెచ్చరించారు.

అయితే, ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమ విధానాలు పారదర్శకంగా ఉన్నాయని, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగేలా చూసుకుంటామని స్పష్టం చేసింది. రాహుల్‌ ఆరోపణలకు సాక్ష్యాలు సమర్పించాలని డిమాండ్‌ చేసింది.

మరోవైపు, బీజేపీ నేతలు కూడా రాహుల్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. “ఆరోపణలు నిజమైతే, అనర్హులైన ఓటర్ల వివరాలను ప్రమాణ పూర్వకంగా సమర్పించాలి. లేనిపక్షంలో ఇది కేవలం రాజకీయ నాటకం” అని బీజేపీ నేత అమిత్‌ మాల్వియా వ్యాఖ్యానించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *