MS Dhoni: క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో విచారణను తిరిగి ప్రారంభించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు సుమారు పదేళ్లుగా పెండింగ్‌లో ఉంది. 2013లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంలో తన పేరును అక్రమంగా చేర్చారని ఆరోపిస్తూ ధోనీ ఈ కేసును 2014లో దాఖలు చేశారు. ధోనీ ప్రధానంగా మీడియా సంస్థలైన జీ మీడియా కార్పొరేషన్, న్యూస్ నేషన్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జి. సంపత్ కుమార్లపై కేసు పెట్టారు.ఈ మీడియా సంస్థలు, సంపత్ కుమార్ ఒకరితో ఒకరు కుమ్మక్కై, ధోనీ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాలుపంచుకున్నట్లు తప్పుడు వార్తలను ప్రసారం చేశారని ధోనీ ఆరోపించారు.
Also Read: Shoaib Akhtar: షోయబ్ అక్తర్‌ను భయపెట్టిన బ్యాట్స్‌మన్ ఎవరంటే?
ఈ తప్పుడు వార్తల వల్ల తనకు కలిగిన పరువు నష్టానికి గాను, రూ. 100 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని ధోనీ డిమాండ్ చేశారు. ఈ కేసు దాఖలు చేసినప్పటి నుంచి వివిధ కారణాల వల్ల విచారణ ముందుకు సాగలేదు. తాజాగా ధోనీ తరపు న్యాయవాదులు, విచారణను వేగవంతం చేయాలని హైకోర్టును కోరారు. ధోనీ స్వయంగా ఒక అఫిడవిట్ దాఖలు చేసి, విచారణకు పూర్తిగా సహకరిస్తానని, అక్టోబర్ 20, 2025 నుండి డిసెంబర్ 10, 2025 మధ్య విచారణకు హాజరు కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ధోనీ ఒక ప్రముఖ వ్యక్తి కాబట్టి, కోర్టులో విచారణ జరిపితే ఇబ్బందులు తలెత్తవచ్చని భావించి, మద్రాస్ హైకోర్టు ధోనీ సాక్ష్యాలను రికార్డు చేయడానికి ఒక అడ్వకేట్ కమిషనర్‌ను నియమించింది. ఈ కమిషనర్ ధోనీ సాక్ష్యాలను చెన్నైలో రికార్డు చేస్తారు.