R Ashwin: సీనియర్ ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ను వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, కొన్ని ప్రధాన క్రీడా సంస్థల నివేదికల ప్రకారం, అశ్విన్ ఇప్పటికే తన నిర్ణయాన్ని సీఎస్కే యాజమాన్యానికి తెలియజేశారు.
గత ఐపీఎల్ సీజన్‌లో అశ్విన్ కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లో ఒకే సీజన్‌లో ఆడిన అతి తక్కువ మ్యాచ్‌లు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్, జట్టులో తన పాత్ర గురించి స్పష్టత కోరానని తెలిపారు. “ఒకవేళ నేను CSK భవిష్యత్తు ప్రణాళికల్లో సరిపోకపోతే, వేరే దారి చూసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు” అని కూడా ఆయన పేర్కొన్నారు.
Also Read: Tim David: సూర్యకుమార్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన టిమ్ డేవిడ్
అశ్విన్ ప్రస్తుతం CSK అకాడమీకి డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్గా కూడా పనిచేస్తున్నారు. ఒకవేళ ఆయన వేరే ఐపీఎల్ ఫ్రాంచైజీకి మారితే, కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమస్యలు తలెత్తకుండా ఈ పదవిని కూడా వదులుకోవాల్సి వస్తుంది. CSK ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిలో భాగంగా అశ్విన్, శివమ్ దూబే వంటి ఆటగాళ్లను ట్రేడ్ చేయవచ్చని ఊహాగానాలు వినిపించాయి. అయితే, రాజస్థాన్ రాయల్స్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.
అశ్విన్ తిరిగి సీఎస్కేలోకి వచ్చినప్పటి నుంచి, పాత ఫామ్‌ను కొనసాగించలేకపోవడంతో పాటు, తన పాత్రపై అస్పష్టత నెలకొనడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే, అశ్విన్ వేరే జట్టుకు ట్రేడ్ అవుతారా లేదా వేలంలోకి వస్తారా అనేది వేచి చూడాలి. దీనిపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి.