Delhi: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లో తన పాదాన్ని బలంగా మోపుతోంది. ప్రారంభించి నెల రోజుల వ్యవధిలోనే, సోమవారం దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో రెండవ షోరూమ్‌ను ప్రారంభించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఏరోసిటీలో వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఈ షోరూమ్‌ను ‘ఎక్స్పీరియన్స్ సెంటర్’గా తీర్చిదిద్దారు. కస్టమర్లు ఇక్కడ టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ SUVని ప్రత్యక్షంగా చూసి, కొనుగోలు విధానం, చార్జింగ్ ఆప్షన్లపై పూర్తి సమాచారం పొందవచ్చు. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ప్రాంతాలకు ఈ కేంద్రం సేవలు అందిస్తుంది. పండుగల సీజన్‌కు ముందే ప్రీమియం ఈవీ మార్కెట్లో బలమైన ముద్ర వేయాలనే వ్యూహంతో టెస్లా ముందుకు వెళ్తోంది.
ప్రస్తుతం భారత్‌లో మోడల్ వై మాత్రమే విక్రయించబడుతోంది.
స్టాండర్డ్ RWD – ₹59.89 లక్షలు
లాంగ్ రేంజ్ RWD – ₹67.89 లక్షలు (ఎక్స్‌షోరూమ్)
జూలై నుంచి బుకింగ్స్ స్వీకరిస్తుండగా, డెలివరీలు 2025 మూడవ త్రైమాసికం నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకసారి చార్జ్ చేస్తే స్టాండర్డ్ మోడల్ 500 కి.మీ., లాంగ్ రేంజ్ వేరియంట్ 622 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. రెండు వేరియంట్ల గరిష్ట వేగం గంటకు 201 కి.మీ. ఫాస్ట్ చార్జింగ్‌తో 15 నిమిషాల్లో వరుసగా 238 కి.మీ., 267 కి.మీ. రేంజ్‌ను తిరిగి పొందవచ్చు.
భారత్‌లో స్థానిక తయారీ యూనిట్ లేదా ఇతర మోడళ్ల లాంచ్‌పై టెస్లా ఇంకా ప్రకటన చేయలేదు. ప్రస్తుతం రిటైల్ నెట్వర్క్ విస్తరణపైనే దృష్టి సారిస్తోంది.

