Dhulipalla Narendra: ధూళిపాళ్ల నరేంద్ర…… ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా అందరికీ పరిచయం ఉన్న పేరు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడంతో.. ఉన్నత విద్య అభ్యసిస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర… తన తండ్రి వారసత్వంగా… తన తండ్రిని నమ్ముకున్న వారికి అండగా… రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తించిన పొన్నూరు నియోజకవర్గ ప్రజలు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మొదటిసారి 1994లో తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అయిన టి.వెంకట రామయ్యను 21,729 ఓట్ల తేడాతో ఓడించారు. ఇలా వరుసగా 5 సార్లు పొన్నూరు నియోజకవర్గంపై టీడీపీ జండా ఎగురవేశారు. అయితే మొదటిసారి 2019లో జగన్ సునామీలో 1100 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. తిరిగి 2024 ఎన్నికల్లో ప్రత్యర్థి అంబటి మురళీ కృష్ణపై 32,915 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడినా ధైర్యంగా నిలబడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఎండకట్టారు. జగన్ అరాచకాలపై ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా బలమైన వాయిస్ వినిపించిన ఏకైక వ్యక్తిగా నరేంద్ర ఉన్నారు. ఫలితంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం నరేంద్రపై కక్షకట్టి జైలు పాలు చేసినా ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి, తనను నమ్ముకున్న క్యాడర్‌కు అండగానే నిలిచారు.
ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లోనూ నరేంద్రది ప్రత్యేక స్థానం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో.. జిల్లా నుంచి ఏకైక టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి, అప్పటి కాంగ్రెస్ ముఖ్యులతో రాష్ట్ర స్దాయిలో, జిల్లా స్దాయిలో ఢీ అంటే ఢీ అన్నారు. పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న నరేంద్ర ఏ అంశం పైన అయినా ఎలాంటి సందిగ్ధత లేకుండా మాట్లాడగల నైపుణ్యం ఉన్న నేత. అసెంబ్లీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీ తరపున తన వాదన సమర్ధవంతంగా వినిపించటంలో నరేంద్ర తొలి స్థానంలో ఉండేవారు. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి నిర్వహించిన సమయంలో ఎన్నో వ్యయ ప్రయాసలను భరించారు. పార్టీ కోసం సొంత నిధులతో కార్యక్రమాలు నిర్వహించారు.
Also Read: Trump-Putin: యుద్ధం ఆపడమే లక్ష్యం.. పుతిన్ తో ట్రంప్ భేటీ
అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నరేంద్రకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. అయితే, నాటి సమీకరణాల్లో నరేంద్రకు పదవి దక్కలేదు. అయినా, నరేంద్ర పార్టీ నాయకత్వం పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన పని తీరులో మార్పు రాలేదు. తాను అమితంగా గౌరవించే చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేసారు. సంగం డైరీని లాభాల బాట పట్టించారు. తన తండ్రి పేరుతో ఒక ఆస్పత్రి నిర్మించారు. తనను నమ్ముకున్న క్యాడర్‌కు అన్ని వేళలా అందుబాటులో ఉంటారు. తన నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో ప్రతీ ఒక్కరినీ పేరు పెట్టి పిలిచే సన్నిహిత సంబంధాలు నరేంద్ర సొంతం. అదే విధంగా వారి నుంచి నరేంద్ర పైన అలాంటి అభిమానమే కనిపిస్తుంది. అధికారంలో ఉన్నా, లేకున్నా నరేంద్ర శైలిలో మార్పు ఉండదు.
ఇన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. అధికార పార్టీ సీనియర్ నేత అయినా నరేంద్ర పైన ఎలాంటి అవినీతి మచ్చ లేదు. రాజకీయ వేధింపుల్లో భాగంగా కేసు నమోదు మినహా, వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా అందరూ నరేంద్రను అభిమానిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో పార్టీ పట్ల విధేయత, అంకిత భావం ఉన్న నేత ఎవరు అంటే.. అందరూ ముందుగా చెప్పే పేరు నరేంద్ర. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నరేంద్రకు ఈ సారి మంత్రి పదవి ఖాయం అని అందరూ భావించారు. ఈసారి కూడా మంత్రి పదవి దక్కలేదు. అయినా, పార్టీ పైనా.. చంద్రబాబు మీదా.. ఎక్కడా అభిమానం తగ్గలేదు. నాటి నుంచి నేటి వరకూ ఒకే విధంగా అంకిత భావం, నిజాయితీ ఆయుధాలుగా నరేంద్ర తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వివాదాలకు దూరంగా అజాత శత్రువుగా నరేంద్ర రాజకీయ ప్రయాణం కొనసాగుతోంది.