Sachin: సిరాజ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన టెండూల్కర్

Sachin: భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సిరాజ్ ఆటలో చూపిస్తున్న ప్రతిభ, దూకుడు తన మనసు దోచేశాయంటూ సచిన్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, అతడి అద్భుత ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించడం లేదన్న అభిప్రాయాన్ని కూడా పంచుకున్నాడు.

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఓవల్‌ వేదికగా నిర్వహించగా, సిరాజ్ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. చివరి రోజున కేవలం 25 బంతుల్లో 9 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ పతనానికి బాటలు వేసాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో 104 పరుగుల ఖర్చుతో ఐదు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది.

ఈ నేపథ్యంలో తన రెడ్డిట్ ఖాతా ద్వారా సచిన్ ఓ వీడియోను పంచుకున్నాడు. అందులో సిరాజ్‌ బౌలింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ, ‘‘సిరాజ్ బౌలింగ్‌ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. అతను బంతి విసిరే తీరు, కాళ్లలో స్ప్రింగ్ ఉన్నట్లుగా దూకుడుగా పరుగెత్తే విధానం నాకు చాలా ఇష్టం. ఇప్పటికే సిరీస్‌లో వెయ్యికి పైగా బంతులు వేసినప్పటికీ, చివరి రోజున కూడా గంటకు 90 మైళ్ల వేగంతో బౌలింగ్ చేయడం నిజంగా అద్భుతం. ఇది అతని పట్టుదల, శ్రద్ధకు నిదర్శనం,” అని కొనియాడాడు.

ఈ సిరీస్ మొత్తంలో 1,113 బంతులు వేసిన సిరాజ్, 32.43 సగటుతో 23 వికెట్లు సాధించి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ‘‘జట్టుకు అవసరమైన ప్రతీసారి సిరాజ్ తన సేవలతో ముందుంటున్నాడు. అయినప్పటికీ అతడికి దక్కాల్సినంత గుర్తింపు రాకపోవడం బాధాకరం’’ అని సచిన్ అభిప్రాయపడ్డాడు.

అలాగే, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై వస్తున్న విమర్శలపైనా సచిన్ స్పందించాడు. ‘‘బుమ్రా ఆడని టెస్టుల్లో భారత్ గెలిచిందన్న మాటలు కేవలం యాదృచ్ఛికం. అతడు ఆడిన మూడు టెస్టుల్లో రెండు సార్లు ఐదు వికెట్లు తీశాడు. బుమ్రా స్థాయి, నాణ్యత గురించి ఎలాంటి సందేహం లేదు. అతను అత్యుత్తమ బౌలర్,” అని స్పష్టం చేశాడు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *