BC Reservation: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ (వెనుకబడిన తరగతులు) రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలో బలమైన నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ మహా ధర్నా ఈ రోజు ఉదయం 11 గంటలకు జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వందల సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ధర్నాలో పాల్గొననున్నారు.
బీజేపీపై విజయశాంతి ఫైర్
ధర్నా ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంలోని బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని ఆమె ఆరోపించారు. కేంద్ర బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఆమోదించేవరకు తమ పోరాటం ఆగదన్నారు.
“తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమంతో సాధించాం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం అదే పోరాటం చేస్తున్నాం. కేంద్రం జారీ చేయాల్సిన ఆర్డినెన్స్ వచ్చే వరకూ బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని విజయశాంతి స్పష్టం చేశారు.
నిరసనకు బలమైన మద్దతు
ఈ ధర్నా ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు తాము అండగా ఉన్నామని, వారి హక్కుల కోసం సమరశంఖం పూరిస్తున్నామని ప్రజలకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర స్థాయిలోనే కాక, జాతీయంగా ఈ అంశంపై చర్చ మొదలయ్యేలా చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం.