Bhatti vikramarka: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు బ్యారేజీల దురవస్థకు మాజీ సీఎం కేసీఆర్ కారణమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ, “కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయాలే మూడు బ్యారేజీల దెబ్బతినటానికి కారణం. నిపుణుల కమిటీ నివేదికను పట్టించుకోకుండా, తగిన అధ్యయనాలు లేకుండా ప్రాజెక్ట్ డిజైన్లు రూపొందించారు,” అని విమర్శించారు.
అప్పట్లో అసెంబ్లీలో “నిపుణుల సూచనల మేరకే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది” అని కేసీఆర్ ప్రకటించినప్పటికీ, వాస్తవంగా కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని భట్టి ఆరోపించారు. అధికార దుర్వినియోగంతో పాటు, సాంకేతిక పరిశీలన లేకుండా తీసుకున్న నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమని స్పష్టం చేశారు.

