Srushti Test Tube Center: విశాఖపట్నంలోని ప్రముఖ ఐవీఎఫ్ సెంటర్‌గా పేరుగాంచిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఇప్పుడో పెద్ద అరాచక వ్యవహారానికి కేంద్రబిందువుగా మారింది. పిల్లలు లేని దంపతులకు సాయం చేసే నెపంతో ఈ సంస్థ కొన్ని తీవ్రమైన అక్రమాల పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలుతోంది.
మరో నలుగురు అరెస్ట్ – మొత్తం 12 మంది అదుపులో
ఈ కేసులో శనివారం ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, రిసెప్షనిస్ట్ నందినిలను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా, ఆదివారం మరో ఏజెంట్ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయిన నేపథ్యంలో తాజా అరెస్టులతో కలిపి మొత్తం 12 మంది నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.
పిల్లల విక్రయం కోసం ఏర్పాటైన గొప్ప నెట్‌వర్క్
ఈ కేసులో బయటపడిన విషయాలు అధికారులను కూడా షాక్‌కు గురిచేశాయి. వివరాల ప్రకారం, విశాఖ ఏజెన్సీలతో పాటు విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో పని చేసే ఏజెంట్లు గర్భిణీలను లక్ష్యంగా పెట్టుకొని, వారిని హైదరాబాదుకు తరలించేవారు. అక్కడ బిడ్డ పుట్టిన వెంటనే డబ్బులిచ్చి తల్లిని పంపించేవారు. ఆ పిల్లలను సరోగసీ పేరుతో ఇతరులకు ఇవ్వడం ద్వారా భారీ డబ్బులు సంపాదించారని సమాచారం.
ఇది కూడా చదవండి: Kalvakuntla Kavitha: బీసీ రిజర్వేషన్ల కోసం ఒంటరి పోరాటం.. నేటి నుంచే కవిత నిరాహార దీక్ష
డబ్బుతో స్థిరాస్తుల కొనుగోలు
ఈ అక్రమ రొడ్డులో సంపాదించిన కోట్లాది రూపాయలతో సికింద్రాబాద్, యూసుఫ్‌గూడ, విజయవాడ, విశాఖ వంటి ప్రాంతాల్లో బిల్డింగ్‌లు, స్థలాలు, ఫామ్‌హౌస్‌లు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఒక వైపు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, మానవత్వం చూపించినట్టు నటించగా.. మరోవైపు ఎంతో హీనంగా తల్లుల నుంచి పుట్టిన పిల్లలను ఎత్తుకెళ్లిన ఘటనలుగా ఇది రూపాంతరం చెందింది.
డాక్టర్ నమ్రతపై కీలక ఆరోపణలు
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతతో పాటు కళ్యాణి అచ్చాయమ్మ, ధనశ్రీ సంతోషిని కూడా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ విచారణ సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో జరుగుతోంది. పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్న ప్రశ్నలు కింది అంశాలపై కేంద్రీకృతమయ్యాయి:
-
ఇప్పటివరకు ఎంతమంది దంపతులకు పిల్లలను అప్పగించారు?
-
ఎన్ని పిల్లలు, ఎక్కడి నుంచి తెచ్చారు?
-
ఈ వ్యవహారాల్లో ఎంత మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగాయి?
మరిన్ని అరెస్టుల అవకాశాలు
ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా మంది ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్నారు. నిందితుల నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కేసు ప్రాముఖ్యత దృష్ట్యా నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.