KTR: “కాంగ్రెస్, బీజేపీ కలిసి ఓట్లు తొలగిస్తున్నాయి”

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ మద్దతుదారులతో సమావేశమై, కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్, బీజేపీ కలిసి ఓట్లు తొలగిస్తున్నాయి. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తన ఓటు జాబితాలో ఉన్నదేమో తప్పక తనిఖీ చేయాలి,” అని ఆయన హెచ్చరించారు.

జూబ్లీహిల్స్ లక్ష్యంగా 50 వేల మెజార్టీ

బీఆర్ఎస్ విజయానికి జూబ్లీహిల్స్ కీలకమైందని, ఈ నియోజకవర్గంలో కనీసం 50,000 మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. “ఇది రాజకీయంగా కీలక నియోజకవర్గం. ఇక్కడి విజయం పార్టీకి గట్టి సంకేతం అవుతుంది,” అని కేటీఆర్ అన్నారు.

మోదీ–రేవంత్‌ల అజెండా ఒక్కటే

ప్రధాని మోదీ మరియు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే విధమైన రాజకీయ అజెండాతో పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. “రేవంత్ అవినీతి వ్యవహారాలను బీజేపీ కాపాడుతోంది. వారి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది,” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతలు

హైదరాబాద్‌లో హైడ్రా ప్రాజెక్ట్ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, అదే సమయంలో కాంగ్రెస్ నాయకులకు మాత్రం హైడ్రా ‘చుట్టంగా’ మారిందని ఎద్దేవా చేశారు. “రేవంత్ ఇల్లు రెడ్డికుంటలో ఉంది. అక్కడ హైడ్రా పేరుతో ఎవరు వెళ్లలేరు. కానీ పేదల ఇండ్లపై బుల్‌డోజర్లు నడుస్తున్నాయి,” అన్నారు.

“రెవంత్‌కు పాలన చేతకాదు”

రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దక్షత రేవంత్ రెడ్డికి లేదని, పాలనలో అసమర్థత స్పష్టమవుతోందని కేటీఆర్ విమర్శించారు. “వాడి వద్దకు అవకాశం వచ్చింది కానీ పాలన చేతకాదు. ప్రజల అభ్యున్నతికి బదులుగా ప్రతీకారం మాత్రమే చూపుతున్నారు,” అంటూ వ్యాఖ్యానించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *