Telangana Excise Department: తెలంగాణ రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ కీలక నిర్ణయాలను తీసుకున్నది. మద్యం దుకాణాల టెండర్ గడువు వచ్చే నవంబర్ 30వ తేదీతో ముగియనున్నది. దీంతో ముందస్తుగా చేపట్టే మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియలో సమూల మార్పులకు రాష్ట్ర ఆబ్కారీ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. వాటిని ప్రభుత్వం కూడా యథావిధిగా అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆగస్టు నెలలోనే కొత్త టెండర్లను పూర్తిచేసే అవకాశం ఉన్నది.
Telangana Excise Department: మద్యం దుకాణాల లైసెన్స్ గడువును రెండేండ్ల నుంచి మూడేండ్లకు పెంచాలని ఆబ్కారీ శాఖ ప్రతిపాదించింది. అంతేకాకుండా వ్యాపార నిబంధనల్లోనూ కొన్ని కీలకమైన మార్పులు చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత నూతన కంపెనీల బ్రాండ్లకు అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే 604 కొత్త రకం బ్రాండ్లు అనుమతుల కోసం దరాఖాస్తులు చేసుకున్నాయి. వాటికి ఈ సారి అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నది.
Telangana Excise Department: 2023-25 టర్మ్‌కు సంబంధించి రూ.2 లక్షల నాన్ రిఫండ్ విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు టెండర్లను నిర్వహించారు. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 690 వరకు ఉన్నాయి. రెండేండ్ల కాలపరిమితికి ఒక్కో దుకాణానికి రూ.1.05 కోట్ల యాన్యువల్ ఫీజుగా నిర్ణయించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఈ ఫీజు రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఉన్నది.
Telangana Excise Department: అయితే వచ్చే టర్మ్ లైసెన్స్ టెండర్ల యాన్యువల్ ఫీజును ఈ సారి మార్చే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. అదే విధంగా ఈ సారి టెండర్లలో పాల్గొనాలని అనుకునే వారు రూ.3 లక్షలు ముందస్తు డిపాజిట్ చేసేలా ప్రతిపాదనలు ఉన్నాయని సమాచారం. గత టెండర్లలో నాన్ రిఫండ్ డిపాజిట్ ద్వారా ఆబ్కారీ శాఖకు రూ.256 కోట్ల ఆదాయం సమకూరింది. యాన్యువల్ ఫీజుతో కలిపితే రూ.2,460 కోట్లుగా ఉన్నది.
Telangana Excise Department: పెరిగిన డిపాజిట్లతో ఈ సారి మరింత ఆదాయం సమకూరేలా ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తున్నది. కాల పరిమితిని మూడేండ్లకు పెంచితే భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నదని అంచనా. దీంతో పాటు దుకాణాల సంఖ్యను కూడా పెంచేలా ప్రతిపాదనలు కూడా చేశారని సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మేజర్ పంచాయతీల్లో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వగా, ఈసారి మరిన్ని కూడలి పంచాయతీలకు కలిపి ఒక మద్యం దుకాణాన్ని అనుమతి ఇవ్వాలని సూచించారు. దీంతో దుకాణాల సంఖ్య భారీగా పెరిగే అవాకశం ఉన్నది.