Karedu Indosole Story: ఇండోసోల్ పరిశ్రమ కోసం కరేడు ప్రాంతంలో జరుగుతున్న భూసేకరణలో కీలక ముందడుగు పడింది. జిల్లా కలెక్టర్ ఆనంద్, స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సంప్రదింపుల కమిటీ కృషితో.. సంస్థ ప్రతినిధులు, రైతుల మధ్య ఏర్పడిన సయోధ్యతో పలువురు రైతులు భూములిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. పూర్తిగా రైతుల అంగీకారం మేరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో మరింత మంది రైతులు ముందుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఇంకా కరేడు రైతుల్ని భయపెట్టేలా అవాస్తవాలు, అసత్య ప్రచారాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో అసలు నిజాలు ఏమిటి? అవాస్తవాలతో కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం ఏమిటి? అన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.
ఎకరం భూమికి రూ.20 లక్షలు అన్నది చాలా పెద్ద మొత్తం. వాస్తవానికి కరేడు ప్రాంతంలోని భూముల ధర రిజిష్ట్రేషన్ ప్రకారం ఎకరం రూ.5 లక్షలు. బహిరంగ మార్కెట్‌లో అయితే ఎకరం రూ.10 లక్షల వరకూ ఉండొచ్చు. భూసేకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎకరానికి రూ.12.5 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది. అయితే స్థానిక రైతుల ఆర్ధిక పరిస్థితులు, ఆందోళనలు పరిగణలోకి తీసుకొని పరిహారం మొత్తాన్ని పెంచి చెల్లించేందుకు ఇండోసోల్ యాజమాన్యం ముందుకొచ్చింది. ఇంతకు ముందు ఎవ్వరూ ఇవ్వని విధంగా మార్కెట్ వ్యాల్యూకు రెట్టింపు ధర.. అంటే ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించేందుకు అంగీకరించింది. అలాగే హార్టికల్చర్, ఆక్వాకల్చర్ సాగు చేస్తున్న భూములు అయితే అదనంగా మరో రూ.3 నుంచి 5 లక్షలు.. అంటే ఎకరానికి 23 లక్షల నుండి 25 లక్షలు చెల్లిస్తారు. కలెక్టర్ సమక్షంలో జరిగిన సంప్రదింపుల కమిటీ చర్చల్లో రైతుల నుంచి వచ్చిన అభ్యర్ధనను మానవత్వంతో పరిశీలించి ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవం ఇలా ఉంటే, భూముల ధర విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణల్లో ఇక అర్థం ఎక్కడుంది? మార్కెట్ ధరకు రెట్టింపు చెల్లింపులు జరపడం అంటే.. కేవలం రైతుల ఆవేదన అర్ధం చేసుకొని, వారిని ఆర్ధికంగా ఆదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతోంది. ఇందుకోసం రైతులు డిమాండ్ చేసిన మేరకు రూ.20 లక్షలు చెల్లించేలా తీసుకున్న నిర్ణయానికి ఇండోసోల్ యాజమాన్యాన్ని కూడా ఒప్పించింది. అయితే ఇక్కడ కేవలం కొందరు వాస్తవాలను వక్రీకరిస్తూ, గ్రామాల్లో దుష్పచారం చేస్తూ, రైతులను అయోమయానికి గురిచేసే కుట్ర చేస్తున్నారని అర్థమౌతోంది. ఇంకా రైతుల్లో ఎవరికైనా సందేహాలు ఉంటే… కలెక్టర్‌ని కలిసి వాస్తవ విషయాలను తెలుసుకునే అవకాశం ఉండనే ఉంది.
Also Read: Gold Washed Away: వరదల్లో కొట్టుకుపోయిన రూ.12 కోట్ల బంగారం.. వీధుల్లో జనాల వెతుకులాట!
ఇక భూసేకరణలో మొత్తం గ్రామాన్నే తరలిస్తారంటూ జరుగుతోన్న ప్రచారం కూడా పూర్తిగా అవాస్తవం. కేవలం 319 ఇల్లు మాత్రమే తరలింపుకు గురవుతాయి. 4,800 ఎకరాల పరిధిలో భూమి సేకరిస్తున్న నేపథ్యంలో కేవలం 319 ఇళ్లు మాత్రమే తొలగించడం జరుగుతుంది. వీరందరికీ వారు కోరుకున్న ప్రాంతంలో సుమారు 50 ఎకరాల్లో లేఅవుట్ వేసి, అందులో ఒక్కొక్కరికి 5 సెంట్ల స్థలం కేటాయించి, ఇల్లు నిర్మించి ఇస్తారు. కాలనీలో పూర్తిస్దాయిలో మౌళిక సదుపాయాలు కల్పిస్తారు. కోల్పోయిన ఇంటికి నష్టపరిహారం కూడా చెల్లిస్తారు. ఇక కరేడు ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటుతో 30 వేల ఉద్యోగాలు సృష్టించబడితే, అందులో కనీసం 6 వేల ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికీ, భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం దక్కుతుంది. ఇక కౌలు రైతులు ఉపాధి కోల్పోవడంతో ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి, ప్రత్యేక దృష్టితో వారికి కూడా కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించనున్నారు. ఇక ప్రస్తుతం ఉంటున్న కాలనీల్లో కంటే.. ఆధునిక వసతి సదూపాయాలతో గుడి, బడి, కమ్యూనిటీ హాల్, అంగన్ వాడీ కేంద్రం ఇలా అన్నీ నిర్మించి ఇస్తారు. ఆర్ ఆండ్ ఆర్ చట్ట పరిధిలో ఉన్న అన్ని నిబంధనలు పూర్తిగా అమలు చేయనున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు విషయంపై ఇళ్లు కోల్పోతున్న వారికి జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అవగహన కల్పించింది. అయితే కొందరు ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాల పేరుతో ఆయా కాలనీల్లోకి వెళ్లి నానా హంగామా చేస్తూ, ఎక్కడో సక్రమంగా జరగని వాటి గురించి వారికి చెబుతుండటంతో.. రైతుల్లో అపోహలు, భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సదరు వ్యక్తులు ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసుకుని అపోహలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
కరేడులో భూసేకరణకు సంబంధించి వాస్తవ విషయాల కంటే అవాస్తవాలను ఎక్కువ ప్రచారం చేస్తూ.. తమ ఉనికిని కాపాడుకోవడానికి కొన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కరేడుతో పాటు మజారా గ్రామాల్లో వివాదాలు రేపుతున్నట్లు తెలుస్తోంది. భూసేకరణ ద్వారా ప్రభుత్వం ప్రవేటు వ్యక్తులకు భూములను అప్పగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్న విధంగా ప్రచారం చేస్తున్నారట. భూములను ఇచ్చేందుకు ముందుకు వస్తున్న వారిపై దాడులకు సైతం పాల్పడుతూ వారిని భయబ్రాంతులను గురిచేస్తున్నారట. ముఖ్యంగా పరిశ్రమల ద్వారా తమ ప్రాంతం అభివృధ్ది జరుగుతుందన్న వాస్తవ విషయాలను తప్పుదోవ పట్టిస్తూ… రైతుల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నట్లుగా కనబడుతోంది. పరిశ్రమలు ఏర్పాటైతే గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యవతకు భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్న వాస్తవ విషయాన్ని దాచిపెట్టి భూములు దోచుకుంటున్నారన్న అసత్యాలను ఎక్కవగా ప్రచారం చేస్తున్నారట కొందరు స్వార్థపూరిత శక్తులు. ఏది ఏమైనా ప్రభుత్వం ఓపిగ్గా రైతులను ఒప్పించి, వారి అంగీకారంతోనే భూసేకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.