Prakash Raj: బెట్టింగ్ యాప్‌ల ప్రచార వ్యవహారంలో తనకు నిర్వాహకుల నుంచి ఎలాంటి డబ్బులు అందలేదని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. ఈ కేసులో గురువారం (జూలై 30) ఆయన Enforcement Directorate (ఈడీ) ఎదుట హాజరయ్యారు. సుమారు ఐదు గంటలపాటు ఈడీ అధికారులు ఆయనను వివిధ కోణాల్లో ప్రశ్నించారు.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రకాశ్ రాజ్, “బెట్టింగ్ యాప్‌లతో డబ్బులు సంపాదించవచ్చని ఎవరూ భావించకూడదు. నేను కూడా ఇకపై అలాంటి యాప్‌లకు ప్రమోషన్ చేయను. ఈ విషయాన్ని స్పష్టంగా ఈడీ అధికారులకు తెలియజేశాను. వారు నా మాటలను నమోదు చేసుకున్నారు,” అని పేర్కొన్నారు.
తనను మరోసారి విచారణకు పిలవాలని ఇప్పటికైతే ఎలాంటి సమాచారం అందలేదని ఆయన తెలిపారు. చట్టానికి తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్‌ల వ్యాపారాలపై దేశవ్యాప్తంగా ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ప్రశ్నించిన ఈడీ.. మరికొందరిని విచారణకు పిలవనుంది.