Jaishankar: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందంపై అమలు నిలిపివేత కొనసాగుతుందని విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్ రాజ్యసభలో స్పష్టం చేశారు. “నీరు మరియు రక్తం కలిసి ప్రవహించలేవు,” అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడనాడేంతవరకూ భారత్ ఈ ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
బుధవారం రోజున జరిగిన రాజ్యసభ సమావేశంలో మాట్లాడిన జై శంకర్, సింధూ జలాల ఒప్పందం కుదుర్చుకున్న కాలంలో భారత రైతుల ప్రయోజనాల కన్నా పాకిస్థాన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. “నెహ్రూ హయాంలో జరిగిన ఈ ఒప్పందం రైతులకు అన్యాయం చేసింది. గతంలో పాలించినవారు ‘గతపు తప్పులను సరిదిద్దలేము’ అని అంటుండేవారు. కానీ మోదీ ప్రభుత్వం వాటిని సవరించగలదని స్పష్టంగా చూపించింది,” అని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు, సింధూ ఒప్పందంపై చర్యలు వంటి కీలక నిర్ణయాలు ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తాయని జై శంకర్ వివరించారు. ఈ ఒప్పందంపై దేశ ప్రయోజనాలను ముందుంచుకుని అవసరమైన మార్పులు ప్రభుత్వం చేస్తున్నదని చెప్పారు.
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి, దాడికి పాల్పడిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) అనే ఉగ్రవాద సంస్థను ఐక్యరాజ్యసమితి తన నివేదికలో తొలిసారి ప్రస్తావించిందని జై శంకర్ తెలిపారు. ఇది గ్లోబల్ స్థాయిలో ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న దృఢవైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.