MP Lavu Works: లావు శ్రీ కృష్ణ దేవరాయలు. టీడీపీ తరఫున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎంపీ.. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై పార్లమెంట్‌లోనే మంట పుట్టించారు. నిజానికి వివాదాల కంటే కూడా ప్రజా సమస్యలపైనే లోక్‌సభలో తన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారీ ఎంపీ. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎంతో కీలక అంశమైన ఈఎస్ఐసీ ఆస్పత్రుల విస్తరణ, ఆధునికీకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎంపీ లేవనెత్తిన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. రాష్ట్రంలో కొత్త ఈఎస్ఐసీ ఆసుపత్రుల స్థాపన కోసం 2024 జులై నుంచి 2025 జూన్ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఒంగోలు, భీమవరం, కడప, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, హిందూపురం జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనలకు తక్షణ ఆమోదంతో పాటూ, అమలు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు, పట్టణ-గ్రామీణ సరిహద్దు ప్రాంతాల్లో లక్షలాది కాంట్రాక్ట్, రోజువారీ కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ ఆసుపత్రులు కీలకమైనవి. ఈ కొత్త ఆసుపత్రుల స్థాపనతో రాష్ట్రంలో ఈఎస్ఐ లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Also Read: Narendra Modi: ప్రధాని మోదీకి కోపం తెప్పించిన కాంగ్రెస్ ఎంపీ.. ఆమె ఎవరు..?
అయితే ఎంపీ లావు కృష్ణదేవరాయలు సొంత నియోజకవర్గం నర్సరావుపేట. నర్సరావుపేటకు ఇప్పటివరకు ఈఎస్ఐ ఆస్పత్రి సదుపాయం అందుబాటులోకి రాలేదన్న కృష్ణదేవరయాలు.. తన నియోజకవర్గంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో 17 జిల్లాల్లో 13 లక్షల మంది ఉద్యోగులు ఈఎస్ఐ సదుపాయాన్ని వినియోగించు కుంటున్నారనీ, ఈ నేపథ్యంలో ప్రతి 25 కిలోమీటర్లకు 50 వేల మందికి ఈఎస్ఐ సదుపాయాన్ని కల్పిస్తూ… 100 పడకల ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని ఎంపీ లావు కేంద్రానికి వివరించారు. ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా… కేంద్రం ఈఎస్ఐ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తోందని… అందులో తన నియోజకవర్గ కేంద్రానికీ అవకాశం కల్పించాలని కోరారీ టీడీపీ నేత. వచ్చే ఐదేళ్లలో నర్సరావుపేటలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేలాది మంది ఉద్యోగులు, కార్మికుల ఆకాంక్షను తమ ఎంపీ గుర్తించారని నరసారావుపేట పార్లమెంట్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.