J. P. Nadda: పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’ పై చర్చ జరుగుతున్న సమయంలో రాజ్యసభలో రాజకీయ వేడి పెరిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. అయితే పరిస్థితులు ఉత్కంఠకు దారి తీసిన తర్వాత… చివరికి నడ్డా తన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పారు.
ఖర్గే వ్యాఖ్యలు – నెహ్రూ ఉదాహరణ
చర్చలో పాల్గొన్న ఖర్గే, 1962 భారత్-చైనా యుద్ధ సమయంలో, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. “నెహ్రూ ప్రజల నుంచి ఏ విషయాన్నీ దాచలేదు. అదే ప్రజాస్వామ్యం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఓ నిజం చెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు,” అని విమర్శించారు.
అంతేగాక, ఖర్గే మాట్లాడుతూ – “ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి సమయం కేటాయిస్తారు. కానీ ప్రతిపక్షాల లేఖలకు సమాధానం చెప్పేందుకు సమయం కేటాయించరు. ఒక రోజు మీ అహంకారం విరిగిపోతుంది,” అని అన్నారు.
నడ్డా స్పందన – ‘మెంటల్ బ్యాలెన్స్’ వివాదం
ఖర్గే ప్రధానమంత్రిని “గద్దార్” అనే పదంతో ఉద్దేశించినట్లు పేర్కొంటూ, జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. ఖర్గే గత 11 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండటం వల్ల మానసిక సమతుల్యత కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఇది కాంగ్రెస్ సభ్యులను కంగారుపెడుతూ, సభలో గందరగోళానికి దారి తీసింది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఈ వ్యాఖ్యలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. నడ్డా మాటలను దళిత నేతలపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దురుద్దేశాల ప్రతిబింబంగా చూశారు కాంగ్రెస్ నేతలు.
కలిసిరావడం – క్షమాపణ
సభలో ఉత్కంఠ ఎక్కువవడంతో… జేపీ నడ్డా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. “మల్లికార్జున్ ఖర్గే గారిని గౌరవిస్తాను. నా మాటల వల్ల మీరు బాధపడితే క్షమించండి. మీరు భావోద్వేగంతో మాట్లాడారు. నేను పేర్కొన్నది మానసిక స్థితి గురించి కాదు… మీరు ఉపయోగించిన పదజాలం మీ స్థాయికి సరిపోదని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు.
