Amit Shah: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత భద్రతా బలగాలు మరోసారి విజయఢంకా మోగించాయి. పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి ముగ్గురు దారుణమైన ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
మహాదేవ్ అడవుల్లో ఉగ్రవాదుల ఉనికి సమాచారం
ఈ సోమవారం ఉదయం శ్రీనగర్ శివార్లలోని లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే ఖచ్చితమైన సమాచారం బలగాలకు లభించింది. వెంటనే వ్యూహాత్మకంగా ఆపరేషన్ మొదలుపెట్టిన సైన్యం, మూడు గంటల వ్యవధిలోనే ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది.
పాకిస్థాన్‌కు లింకులు ఉన్న ఉగ్రవాదులు
హతమైన ముగ్గురిలో సులేమాన్, ఆఫ్ఘన్, జిబ్రాన్ ఉన్నారు. వీరంతా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు కావడం గమనార్హం. వారి వద్ద నుంచి విదేశీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఆహారం, సహాయం అందించేవారిని ముందే అదుపులోకి తీసుకున్నారు. వారి సమాచారం ఆధారంగా ఉగ్రవాదులను గుర్తించారు.
సులేమాన్ – పహల్గామ్ దాడికి సూత్రధారి
ఈ ఉగ్రవాదులు ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మందిని మతాన్ని అడిగి హత్య చేసిన దాడిలో పాల్గొన్నారు. అందులో కీలకంగా ఉన్న సూత్రధారి సులేమాన్‌ను మొదట హతమార్చారు. అనంతరం మిగతా ఇద్దరిని కాల్చి చంపారు.
ఇది కూడా చదవండి: Operation Sindoor: ముందు దేశం తర్వాతే పార్టీ.. కాంగ్రెస్ ఎంపీ కీలక పోస్ట్..
పార్లమెంట్‌లో అమిత్ షా స్పందన
ఈ విషయంపై మంగళవారం పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ .. “భారత సైన్యం, CRPF, J&K పోలీసులు కలిసి ఆపరేషన్ మహాదేవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. కానీ ఈ విజయం పట్ల కొంతమంది విపక్ష నేతలు అసంతృప్తిగా కనిపించారు” అన్నారు.
అలాగే పహల్గామ్‌లో అమాయకులపై జరిగిన దాడిని “అనాగరిక చర్య”గా అభివర్ణించిన ఆయన, బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు.
జిబ్రాన్ – మరో కీలక ఉగ్రవాది
హతమైన జిబ్రాన్ గురించి వివరాలిచ్చిన హోంమంత్రి, అతను గత సంవత్సరం అక్టోబర్‌లో సోనామార్గ్ టన్నెల్ దాడిలో పాల్గొన్నట్టు చెప్పారు. ఆ దాడిలో ఏడుగురు చనిపోయారు, అందులో ఓ వైద్యుడు కూడా ఉన్నారు.

