Nimisha Priya

Nimisha Priya: యెమెన్‌లో నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు.!

Nimisha Priya: యెమెన్‌లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిష ప్రియకు ఊహించని శుభవార్త అందింది. ఆమె మరణశిక్షను రద్దు చేయడానికి యెమెన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ఈ తీర్పు వెలువడినట్లు తెలుస్తోంది. భారత గ్రాండ్‌ ముఫ్తీ, ప్రముఖ సున్నీ నాయకుడు కాంతపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడగా, భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది.

ఈ ముఖ్యమైన నిర్ణయానికి ముందు యెమెన్ రాజధాని సనాలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు వెల్లడించారు. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కోసం భారత గ్రాండ్‌ ముఫ్తీ అబూబకర్‌ ముస్లియార్‌ చేసిన విజ్ఞప్తి మేరకు, యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు షేక్‌ హబీబ్‌ ఒమర్‌ బిన్‌ హఫీజ్‌ ఒక ప్రత్యేక బృందాన్ని చర్చల కోసం నియమించారు.

ఈ బృందం, అబూబకర్‌ ముస్లియార్‌ అంతర్జాతీయ స్థాయిలో చేసిన మధ్యవర్తిత్వంతో కలిసి యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఈ చర్చలు విజయవంతం కావడంతో నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకు యెమెన్‌ అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం ప్రకటించింది. ఈ ప్రకటనను యెమెన్‌లోని ‘యాక్షన్‌ కౌన్సిల్‌ ఫర్‌ తలాల్‌ మహదీస్‌ జస్టిస్‌’ ప్రతినిధి సర్హాన్‌ షంశాన్‌ అల్‌ విశ్వాబి కూడా ధృవీకరించారు. మత పండితులు చేసిన బలమైన కృషి వల్లే ఈ నిర్ణయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

అయితే, నిమిష ప్రియ జైలు నుంచి విడుదల అవుతుందా లేదా ఆమెకు జీవితఖైదు పడే అవకాశం ఉందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. హత్యకు గురైన యెమెన్‌ పౌరుడు తలాల్‌ మహదీ కుటుంబ సభ్యులతో తదుపరి చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Also Read: Jai shankar: పాక్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ గట్టి బుద్ధి చెప్పింది

యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో నిమిష ప్రియకు యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. నిమిష ప్రియ, తలాల్‌ మహదీ కలిసి యెమెన్‌లో ఒక క్లినిక్‌ను నడిపేవారు. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో, తలాల్‌ నిమిషపై వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ క్రమంలో నిమిష, మరో వ్యక్తితో కలిసి తలాల్‌కు మత్తు మందు ఇవ్వగా, అది అధిక మోతాదు కావడంతో అతను మరణించాడు.

ఈ కేసులో జులై 16న మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా, భారత ప్రభుత్వం చేసిన పలు విజ్ఞప్తుల మేరకు యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. అప్పటి నుండి భారత ప్రభుత్వం యెమెన్ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతూ, కేసు పరిష్కారానికి కృషి చేసింది. భారత గ్రాండ్‌ ముఫ్తీ, సూఫీ పెద్దల చొరవతో ఈ ప్రయత్నాలు ఫలించి నిమిష ప్రియకు ఊరట లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *