Fake Apple Products: భాగ్యనగరంలో జరుగుతున్న నకిలీ యాపిల్ ఉత్పత్తుల అక్రమ వ్యాపారాన్ని పోలీసులు సమర్థవంతంగా అడ్డుకున్నారు. మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు చేసిన దాడుల్లో సుమారు రూ. 3 కోట్ల విలువైన భారీ మొత్తంలో నకిలీ యాపిల్ పరికరాలు బయటపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్‌పురోహిత్ ఉన్నారు. వీరి నుంచి మొత్తం 2,761 నకిలీ యాపిల్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నకిలీ యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్‌లు, పవర్‌బ్యాంకులు, కేబుల్స్‌తో పాటు ఇతర ఉపకరణాలు ఉన్నాయి.
Also Read: Eagle Team: రూ. 5 కోట్ల విలువైన 455 గంజాయి ప్యాకెట్లు పట్టివేత..ఈగల్ టీం దెబ్బ మామూలుగా లేదుగా..!
నిందితులు ముంబైలోని ఏజెంట్ల నుంచి ఈ డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్‌లను కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆపై, ఈ నకిలీ వస్తువులకు ఒరిజినల్ యాపిల్ లోగోలు, స్టిక్కర్లు, సీల్‌లతో నకిలీ ప్యాకేజింగ్ చేసి, అచ్చం అసలైన వాటిలాగే కనిపించేలా తయారు చేస్తున్నారు. ఇలా వినియోగదారులను సులభంగా మోసం చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. తక్కువ ధరలకు దొరుకుతున్నాయని భావించి అనేక మంది అమాయక వినియోగదారులు ఈ నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేసి మోసపోతున్నారు.
అరెస్ట్ చేసిన నిందితులను లోతుగా విచారిస్తున్నట్లు సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ నకిలీ ఉత్పత్తుల సరఫరాకు సంబంధించిన పూర్తి నెట్‌వర్క్, ముంబైలోని ఏజెంట్లు ఎవరు, వారికి ఇంకెక్కడెక్కడ లింకులు ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజలు నకిలీ ఉత్పత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అధీకృత యాపిల్ స్టోర్‌లు లేదా నమ్మకమైన డీలర్ల వద్ద మాత్రమే వస్తువులను కొనుగోలు చేయాలని పోలీసులు హెచ్చరించారు.