Hyderabad: హైదరాబాద్‌లో టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ ముఠా మోసం – సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్‌

Hyderabad: హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని ‘సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌’ దంపతులను మోసం చేసి, చైల్డ్ ట్రాఫికింగ్‌ కేసులో చిక్కుకుంది. ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రత, సరోగసీ పేరుతో దంపతులను బురిడీ కొట్టించిందని డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఆసుపత్రికి సరైన అనుమతులు లేకుండానే అక్రమంగా IVF చికిత్సలు, సరోగసీ పద్ధతులు నిర్వహించినట్లు తెలిపారు.

రెజిస్ట్రేషన్ లేకుండానే కొనసాగిన ఆసుపత్రి

2021లో ఆసుపత్రి రెజిస్ట్రేషన్ గడువు ముగిసినా, కోర్టుకు మూసివేస్తామని చెప్పి, గుట్టుచప్పుడు కాకుండా కార్యాచరణ కొనసాగించినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది.

వాస్తవమైన సరోగసీ కాదు – రూ. 90 వేలకు శిశువు కొనుగోలు

ఒక దంపతులు సంతానలేమితో బాధపడుతూ సృష్టి సెంటర్‌ను సంప్రదించగా, డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ సాధ్యం కాదని చెప్పి సరోగసీ ద్వారా సంతానం పొందవచ్చని నమ్మించారు. దంపతుల నుంచి అండం, వీర్యం సేకరించినట్లు తెలిపి, విశాఖపట్నానికి చెందిన ఓ మహిళను సరోగసీ మదర్‌గా చూపించారు. కొన్ని నెలల తర్వాత శిశువును అప్పగించారు.

అయితే అనుమానం వచ్చిన దంపతులు డీఎన్‌ఏ పరీక్ష చేయించగా, శిశువు తమకు సంబంధించింది కాదని తేలింది. దర్యాప్తులో అసలు సరోగసీ జరిగేలా చేయక, అస్సాంకు చెందిన ఓ మహిళ నుంచి రూ. 90 వేలకి శిశువును కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

వైద్య నిబంధనలకు విరుద్ధంగా విధులు – బెదిరింపులకు పాల్పడ్డ కుమారుడు

డాక్టర్ నమ్రతతో పాటు సెంటర్ సిబ్బంది కూడా వైద్య నిపుణులు కాదని, నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాదు, ఈ మోసంలో డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ కూడా బాధిత దంపతులను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

8 మందిని అరెస్ట్ – చైల్డ్ ట్రాఫికింగ్‌గా కేసు నమోదు

ఈ కేసులో డాక్టర్ నమ్రతతో పాటు మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ ఘటనను ఆమె చైల్డ్ ట్రాఫికింగ్‌గా అభివర్ణించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *