Bandi Sanjay

Bandi Sanjay: కేటీఆర్‌పై సీఎం రమేశ్‌ ఆరోపణలు నిజమే: కేంద్రమంత్రి బండి సంజయ్‌

Bandi Sanjay: తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయ రచ్చ మరింత తీవ్రమైంది. సీఎం రమేష్ ఆరోపణలు నిజమేనని బండి సంజయ్ ధృవీకరించారు.

కేటీఆర్, సీఎం రమేష్‌ల మధ్య బహిరంగ చర్చకు తాను సిద్ధమని, సీఎం రమేష్‌ను కరీంనగర్‌కు తీసుకొస్తానని బండి సంజయ్ సవాల్ విసిరారు. చర్చకు కేటీఆర్ తేదీ, సమయం చెప్పాలని కోరారు. పదేళ్లలో కేటీఆర్ చేసిన అవినీతిపై సాక్ష్యాలతో చర్చకు వస్తామని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఒక కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అని తాను చాలాసార్లు చెప్పానని బండి సంజయ్ గుర్తు చేశారు. ఆ పార్టీని బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ అంటే ‘బిడ్డా, అల్లుడు, కొడుకు, అయ్య’ పార్టీ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

కంచె గచ్చిబౌలి భూముల వివాదం కేంద్రంగా ఈ రాజకీయ రచ్చ మొదలైంది. కేటీఆర్, సీఎం రమేష్‌ల మధ్య మాటల యుద్ధం ‘కోవర్ట్ రాజకీయాలు’, ‘డైవర్ట్ పాలిటిక్స్’ అనే స్థాయికి చేరింది. కంచె గచ్చిబౌలి భూముల కోసం సీఎం రమేష్‌కు ఫ్యూచర్ సిటీలో రూ.1600 కోట్లకు పైగా రోడ్ల కాంట్రాక్ట్ ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా సీఎం రమేష్, తనకు ఆ కాంట్రాక్ట్‌తో సంబంధం లేదని స్పష్టం చేస్తూనే, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

“ఢిల్లీలో నా ఇంటికి వచ్చింది మరిచిపోయారా? కవిత విచారణ ఆపేస్తే బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తామని చెప్పింది నిజం కాదా? మాల్దీవులు, అమెరికా ఎలా వెళ్లారో, ఎందుకు వెళ్లారో చెప్పమంటారా?” అంటూ సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌కు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ సీఎం రమేష్ సహాయంతోనే వచ్చిందని, మొదట కేసీఆర్ తన కొడుకుకు టికెట్ ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు.

సీఎం రమేష్ వ్యాఖ్యలకు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. కంచె గచ్చిబౌలి భూములు, ఫ్యూచర్ సిటీ రోడ్డు కాంట్రాక్ట్‌పై సీఎం రమేష్, రేవంత్ రెడ్డితో కలిసి వస్తే చర్చకు తాను సిద్ధమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్కామ్‌లు బయటపడినప్పుడల్లా ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ విలీనం అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతకుముందు, తెలంగాణకు రేవంత్ రెడ్డే పెద్ద కోవర్ట్ అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Nara Lokesh: ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది ఉన్నారు.. ఆ క్రెడిట్ సీఎం చంద్రబాబుకె

ఈ వివాదంలో అధికార కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కోవర్ట్ అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌కు దమ్ముంటే సీఎం రమేష్ ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రమేష్ ఇంటికి కేటీఆర్ వెళ్లారా లేదా అని ప్రశ్నించిన ఆది శ్రీనివాస్, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రవాళ్లతో తిరిగింది మీరే కదా అని అన్నారు.

ఇదిలా ఉండగా, బోనాల పండుగ సందర్భంగా బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడిని కూల్చడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువుల మనోభావాలను గాయపరిచే చర్య అని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లను సంపాదించేందుకు కాంగ్రెస్ ఈ చర్యకు పాల్పడిందని ఆయన విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు లబ్ధి చేకూరుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *