Hyderabad: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో మహిళలు ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. దీని వల్ల సుమారు రూ.6680 కోట్ల ప్రయాణ ఛార్జీలు మహిళలు ఆదా చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంజీబీఎస్ (MGBS)లో ‘మహాలక్ష్మి సంబరాలు’ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తైన నేపథ్యంలో మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే, 2023 డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శాసనసభ వేదికపై ఈ మహాలక్ష్మి పథకం ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. మహిళల ప్రయాణాన్ని సులభతరం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని చెప్పారు.
పథకం విజయవంతంగా అమలవ్వడానికి కృషి చేసిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
“ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కడికి కావాలన్నా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఉద్యోగాలకు, ఆలయాలకు, షాపింగ్‌కు, అవసరమైన ప్రతీ చోటికి స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నారు. ఎవరి సహాయం అవసరం లేకుండా బయటకు వెళ్లే స్వాతంత్ర్యం కలిగింది,” అని మంత్రి పేర్కొన్నారు.
అలాగే గత పదేళ్లలో ఆర్టీసీని తుత్తునియలు చేశారంటూ ఆయన విమర్శించారు.
“ఎప్పటికైనా ఆర్టీసీ ఉండదేమోనన్న పరిస్థితి అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్టీసీ పునర్జీవించగలిగింది. నష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకున్నాం,” అని మంత్రి పునరుద్ఘాటించారు.