RTC Bus Catches Fire: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన కలకలం రేపుతోంది. జూలై 22 అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నైట్‌హాల్ట్ కోసం పార్క్ చేసి ఉంచిన బస్సుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.
కాలిపోయిన బస్సు మిర్యాలగూడ డిపోకు చెందిన TS05Z0047 నంబర్‌ది. ప్రతిరోజూ తడకమళ్ల ప్రధాన బస్‌స్టాప్ వద్ద ఈ బస్సును రాత్రి పార్క్ చేస్తారు. ఆ రోజు కూడా రాత్రి సాధారణంగా నిలిపి ఉంచగా, ఆకతాయిలు బస్సు వెనుక భాగంలో నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. బస్సు పాక్షికంగా దగ్ధమైందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Bangladesh: 27కు చేరిన బంగ్లాదేశ్ విమాన మృతుల సంఖ్య
స్థానికుల ఆరోపణల ప్రకారం, ఈ ఘటన వెనుక తాగుబోతులు లేదా గంజాయి వాడే ఆకతాయిలే ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది సరదాగా చేసిన పని కాదా? లేక ఉద్దేశపూర్వకంగానా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
సమాచారం అందుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, ఎస్‌ఐ లక్ష్మయ్య సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆర్టీసీ అధికారులు కూడా గ్రామానికి వచ్చి బస్సు పరిస్థితిని పరిశీలించారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ, నిప్పు పెట్టిన వారి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు సామాజిక బాధ్యతల లోపాన్ని చూపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో పోలీసులు త్వరలోనే బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.