Kubera: టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రల్లో, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా చిత్రం ‘కుబేర’ ఆన్‌లైన్ పైరసీకి బలైంది. ఈ నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలోని యాంటీ వీడియో పైరసీ సెల్ పైరసీ మూలాలను గుర్తించేందుకు వాటర్ మార్కింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ ప్రక్రియలో, హైదరాబాద్ సెంట్రల్ మాల్‌లోని పీవీఆర్ థియేటర్ స్క్రీన్-5లో ‘కుబేర’ సినిమాను చట్టవిరుద్ధంగా వీడియో రికార్డు చేసిన ఘటనను గుర్తించినట్టు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇప్పటికే ఈ నెల 2న, ఏడాదిన్నర కాలంలో 40 సినిమాలను పైరసీ చేసిన కిరణ్ కుమార్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ దర్యాప్తు నేపథ్యంలో, ‘కుబేర’ పైరసీ వ్యవహారాన్ని కూడా అధికారులు లోతుగా విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vishal Marriage: వాయిదా పడిన విశాల్ పెళ్లి.. ఎందుకంటే..?
పైరసీతో నిర్మాతలకు ఆందోళన
ఇటీవల కాలంలో సినిమాలు రిలీజ్ అయిన రోజు లేదా మరుసటి రోజే పైరసీ ప్రింట్లు ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయి. దీని వల్ల నిర్మాతలు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. పైరసీని అరికట్టేందుకు ఫిల్మ్ ఛాంబర్, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే మాత్రమే ఈ సమస్య తగ్గుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తెలుగు వసూళ్లలో ‘కుబేర’ సత్తా
భారీ అంచనాలతో విడుదలైన ‘కుబేర’ సినిమాకు తెలుగులో మంచి ఆదరణ లభించింది. భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం తమిళనాట మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు.
ఈ విషయంపై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందిస్తూ, “కుబేర కథ, ధనుష్ పాత్ర తమిళ ప్రేక్షకుల అభిరుచికి బాగా నప్పేలా ఉంది. సాధారణంగా ఇలాంటి వైవిధ్యమైన కథలు, పాత్రలను తమిళనాట బాగా ఆదరిస్తారు. అయినా వసూళ్లు తక్కువ రావడం ఆశ్చర్యంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.