Amit sha: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ శరవేగంగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ అభివృద్ధికి బలమైన బునియాది ఏర్పడిందని, ఈ పదేళ్లలో 60 శాతం ఆర్థిక వృద్ధి నమోదైందని తెలిపారు. దేశవ్యాప్తంగా 45 వేల కిలోమీటర్ల రైలు మార్గాలు, రహదారులు నిర్మించబడినట్లు చెప్పారు. వాజ్‌పేయి హయాంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, మోదీ పాలనలో నాలుగో స్థానానికి చేరుకుందని గుర్తుచేశారు.
ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్‌కు ముందున్నాయని, ప్రస్తుతం చేపడుతున్న ఆర్థిక విధానాలతో 2027లో జర్మనీని అధిగమించి మూడవ స్థానానికి చేరుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఆకర్షణ, సులభతర వ్యాపార నిబద్ధత, మూలధన వ్యయాల్లో పెంపు వంటి చర్యలు ఈ దిశగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని తెలిపారు.
అంతేకాకుండా, 2047 నాటికి భారత్‌ను పూర్తిస్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని ప్రధాని మోదీ సంకల్పించారని షా స్పష్టం చేశారు.

