CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కొల్లాపూర్ మండలం జటప్రోలు గ్రామంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు.
సీఎం పర్యటన వివరాలు:
మధ్యాహ్నం 1:45 గంటలకు జటప్రోలు చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముందుగా అక్కడి ప్రసిద్ధ మదనగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం, సరిగ్గా 2 గంటలకు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేస్తారు.
ఈ పాఠశాలల నిర్మాణం కోసం రాష్ట్ర విద్యాశాఖ రూ. 11 వేల కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ తరహా గురుకుల పాఠశాలలు నిర్మించనున్నారు. ఒక్కో పాఠశాలకు రూ. 200 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక సౌకర్యాలతో ఈ పాఠశాలలను నిర్మిస్తారు. బోధనా సిబ్బంది కూడా అక్కడే నివసించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో, డిజిటల్ పాఠాలతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి గతంలోనే స్పష్టం చేశారు.
Also Read: CM Siddaramaiah: ‘సిద్ధరామయ్య కన్నుమూశారు’ .. సీఎంను ఇబ్బందుల్లోకి నెట్టిన మెటా
శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభలో ‘ఇందిరా మహిళా శక్తి పథకం’ లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. నేడు శుక్రవారం కావడంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో, నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.