KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మేడిగడ్డ బరాజ్ కూలిందంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్న రేవంత్‌కు, “దమ్ముంటే మేడిగడ్డ మీదకే రా… చర్చ పెట్టుదాం” అంటూ సవాల్ విసిరారు. నాగార్జునసాగర్ కట్టపై చర్చకు రావాలంటూ రేవంత్ సవాల్ చేస్తున్నా, మేడిగడ్డ సమస్యపై స్పష్టత ఇవ్వాల్సింది ముందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రేవంత్ భాషకు ఇదే సమాధానం
రాజకీయాల్లో తిట్లు మాట్లాడడం తమకు ఇష్టం లేదని కేటీఆర్ అన్నారు. అయితే రేవంత్ రెడ్డి దిగజారుడు భాష వాడుతున్నారని, “కుక్క కాటుకు చెప్పు దెబ్బ” అన్నట్లు సమాధానం ఇవ్వాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. రేవంత్ భాషతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: TS News: జలశక్తిశాఖ కీలక సమావేశం.. తెలంగాణ 10 ప్రతిపాదనలు ఇవే..
జగదీశ్వర్ సవాల్… రేవంత్ మౌనం
బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికే మేడిగడ్డ బరాజ్ వద్దకు వెళ్లి సవాల్ విసిరారని, కానీ రేవంత్ రెడ్డి చర్చకు రావడానికి వెనుకాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. “మా నాయకుడు కేసీఆర్ తుంగతుర్తి, సూర్యాపేట చివరి మడికీ నీరు ఇచ్చారు. అయినా కూడా రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నాడు” అని కేటీర్ అన్నారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు
రేవంత్ పదే పదే బడ్జెట్ లేదని తప్పించుకుంటూ, “ఏమైనా అంటే నన్ను కోసుకుని తింటారా” వంటి మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే రేవంత్‌కు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.